Begin typing your search above and press return to search.

'అయ‌లాన్` ఈ హాలీవుడ్ ఏలియ‌న్ మూవీకి కాపీ?

ఇదిలా ఉంటే 2011లో హాలీవుడ్‌లో విడుదలైన `పాల్‌` సినిమాని పోలి ఉండటంతో అయలాన్ ట్రైలర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   9 Jan 2024 1:30 PM GMT
అయ‌లాన్` ఈ హాలీవుడ్ ఏలియ‌న్ మూవీకి కాపీ?
X

చాలా బాలీవుడ్ సినిమాల‌ను హాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొంది తెర‌కెక్కించారు. సౌత్ లోను కొన్ని సినిమాల‌కు హాలీవుడ్ స్ఫూర్తి ఉంది. ఇప్పుడు అదే తీరుగా త‌మిళ సినిమా అయ‌లాన్ కి హాలీవుడ్ స్ఫూర్తి ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. శివకార్తికేయన్ నటించిన `అయలాన్` జనవరి 12న గ్రాండ్ థియేటర్లలో విడుదల కానుంది. సైన్స్ ఫిక్షన్ క‌థాంశంతో రూపొందించిన ఈ చిత్రం పలు భాషల్లో విడుదలకు సిద్ధ‌మ‌వుతోంది. కొన్ని రోజుల క్రితం `అయలాన్` ట్రైలర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. ట్రైల‌ర్ ఈ చిత్రానికి బజ్‌ను పెంచింది. ఇదిలా ఉంటే 2011లో హాలీవుడ్‌లో విడుదలైన `పాల్‌` సినిమాని పోలి ఉండటంతో అయలాన్ ట్రైలర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

పాల్ ఒక గ్రహాంతర వాసి గురించిన క‌థాంశం. అతడు(ఏలియన్) దారి తప్పి భూమిపైకి వస్తాడు. ఇద్దరు స్నేహితులు ఆ జీవిపై పరిశోధన చేయాలనుకునే శాస్త్రవేత్తల నుండి దానిని రక్షించడానికి ప్రయత్నిస్తారు. `అయలాన్` ట్రైలర్ చూశాక ఇంచుమించు ఇదే రకమైన కథలా కనిపించింది. ఇది సోషల్ మీడియాలో తమిళ - హాలీవుడ్ చిత్రాల మధ్య పోలికను చూడ‌టానికి కార‌ణ‌మైంది. పలువురు నెటిజనులు శివకార్తికేయన్ నటించిన చిత్రం `పాల్` నుండి ప్రేరణ పొందిందని పేర్కొన్నారు. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఫ్యాన్స్ థియరీలను బ్రేక్ చేసేలా క‌థాంశం ఉంటుందా లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

రవికుమార్ దర్శకత్వం వహించిన `అయాళన్`లో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో న‌టించాడు. రకుల్ ప్రీత్ సింగ్, ఇషా కొప్పికర్, యోగి బాబు, కరుణాకరన్, బాను ప్రియ, బాల శరవణన్, శరద్ కేల్కర్ కీలక పాత్రలు పోషించారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించగా ఈ చిత్రానికి సిబిఎఫ్‌సి `యు` సర్టిఫికేట్ ఇచ్చింది. `అయలాన్` నిర్మాతలు చిత్ర నిర్మాణం కోసం 4 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇందులో 4500 VFX ఫ్రేమ్‌లు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో హాస్యభరితమైన గ్రహాంతరవాసి పాత్ర ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. గ్ర‌హాంత‌ర వాసితో రైతు శివ‌కార్తికేయ‌న్ స్నేహం అనంత‌రం ఏం జ‌రిగింద‌నేదే ఈ సినిమా.