25 వచ్చినా సంపాదన లేదని స్టార్ డాటర్ వ్యథ
ఇరా ఖాన్ చాలా సందర్భాల్లో తన మానసిక సమస్యల గురించి బహిరంగంగా వెల్లడించింది. తాను ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
By: Tupaki Desk | 28 April 2025 4:00 AM ISTఆమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ చిన్న వయసులోనే తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. భార్య అమృత నుంచి అమీర్ విడిపోవడంతో దాని ప్రభావం ఎదిగే వయసులో కుమార్తె ఇరా ఖాన్ పై పడింది. తన కూతురు ఇరాతో అమీర్ టైమ్ స్పెండ్ చేయలేకపోయాడు. కెరీర్ పరమైన ఒత్తిళ్ల కారణంగా అమీర్ ఖాన్ తన కుమార్తె కోసం ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. ఆ తరవాత స్టడీస్ కోసం ఇరా ఖాన్ హాస్టళ్లలో ఒంటరిగా గడపాల్సి వచ్చింది. కారణం ఏదైనా ఇరా తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇరా ఖాన్ చాలా సందర్భాల్లో తన మానసిక సమస్యల గురించి బహిరంగంగా వెల్లడించింది. తాను ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఏడాది క్రితం కూతురితో కలిసి అమీర్ ఖాన్ కూడా మానసిక చికిత్సాలయానికి వెళ్లాడు. ప్రతి సెషన్ కు కూతురితో కలిసి అతడు హాజరయ్యాడు. ఇరా ఖాన్ మానసిక సమస్యల్లో కూరుకుపోయే వారిని బయటకు తీసుకు రావడమే లక్ష్యంగా పనిచేసే లాభాపేక్షలేని సంస్థను ప్రారంభించారు.
ఎవరైనా మానసిక గాయం, ఒత్తిడి లేదా ఇతర సమస్యతో బాధపడుతున్నామని భావిస్తే, వృత్తిపరమైన శిక్షణ పొందిన వారు మీకు సహాయం చేయగలరు.. అలాంటి వ్యక్తి కోసం వెతకాలని అమీర్ ఖాన్ సలహా ఇచ్చారు. ఇందులో సిగ్గుపడటానికి ఏమీ లేదని కూడా అన్నారు..! అని అమీర్ ఖాన్ జోడించారు. ఇరా ఖాన్ మానసిక సమస్యలు ఉన్నవారికి సేవలు చేసేందుకు అగస్తు ఫౌండేషన్ ని స్థాపించారు.
తాజా ఇంటర్వ్యూలో ఇరా ఖాన్ మాట్లాడుతూ.. తాను 25 వయసులో కూడా సంపాదించకుండా, ఇంటిపై ఆధారపడి జీవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. దీని కారణంగా తల్లిదండ్రుల కోసం తాను ఏమీ చేయలేకపోతున్నానని కలత చెందింది. అయితే అమీర్ ఖాన్ మాత్రం తన కుమార్తెను సమర్థిస్తూ.. తను చేసే మంచి పనుల్లోనే ఆనందం ఉంది.. డబ్బుతో ఆనందం రాదని అన్నారు. ఇరా ఖాన్ సంపాదించకపోయినా తనకు నష్టం లేదని వ్యాఖ్యానించారు.
