Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కు ఐపీఎల్ గండం!

2024 సమ్మర్ సీజన్‌లో పెద్ద సినిమాల విడుదలలు లేకపోవడం సినీ ప్రియులను నిరాశ పరుస్తుంది.

By:  Tupaki Desk   |   29 Feb 2024 7:30 AM GMT
టాలీవుడ్ కు ఐపీఎల్ గండం!
X

సినీ ఇండస్ట్రీలో ఫిబ్రవరి, మార్చి నెలలను డ్రై సీజన్ గా భావిస్తుంటారు. తెలుగు స్టేట్స్ లో అన్ని తరగతుల స్టూడెంట్స్ కు ఆ టైంలోనే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి.. ఆ రెండు నెలల్లో పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాల రిలీజులు పెట్టుకోరు. సంక్రాంతి తర్వాత సినిమాలకు అతి పెద్ద సీజన్ గా భావించే సమ్మర్ లోనే రావాలని అందరూ ప్లాన్ చేసుకుంటారు. అందరికీ వేసవి సెలవులు ఉంటాయి.. వాటిని క్యాష్ చేసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం దానికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2024 సమ్మర్ సీజన్‌లో పెద్ద సినిమాల విడుదలలు లేకపోవడం సినీ ప్రియులను నిరాశ పరుస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఐపీఎల్ క్రికెట్ టోర్నీ, ఎలక్షన్స్ అని అర్థమవుతోంది.

సమ్మర్ బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి ఉంటుందనే ఆలోచనతో, క్లియరెన్స్ సేల్ అన్నట్లుగా చిన్నా చితకా చిత్రాలన్నిటినీ ఈ గ్యాప్ లోనే థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. మార్చిలో 'ఆపరేషన్ వాలెంటైన్', 'భీమా', 'గామి', 'టిల్లు స్క్వేర్' లాంటి కొన్ని క్రేజీ సినిమాలు కూడా రాబోతున్నాయి. రేపు 1వ తారీఖున వరుణ్ తేజ్ మూవీ వస్తే, నెలాఖరున సిద్ధు జొన్నలగడ్డ చిత్రం రానుంది. మధ్యలో గోపీచంద్, విశ్వక్ సేన్ సినిమాలు వస్తున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'ఫ్యామిలీ స్టార్' మూవీ రిలీజ్ కానుంది. ప్రస్తుతానికైతే ఈ సీజన్ లో ప్రకటించిన ఆసక్తికరమైన చిత్రాలు ఇవి మాత్రమే. ఇక ఏప్రిల్ రెండో వారం మొదలుకుని, జూన్ రెండో వారం వరకూ చెప్పుకోదగ్గ చిత్రాలేవీ కనిపించడం లేదు.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'కల్కి 2898 AD' చిత్రాన్ని 2024 మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా ముందుగా చెప్పిన సమయానికి రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. కమల్ హాసన్, శంకర్ కాంబోలో రూపొందుతున్న 'భారతీయుడు 2' సినిమాని మే 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై టీమ్ నుండి ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు. సమ్మర్ లో ఐపీఎల్-2024 సీజన్, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఉండటం వల్లనే పెద్ద సినిమాలు వెనక్కి తగ్గుతున్నాయనే కామెంట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

ఏపీలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం హీటెక్కింది. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో, కొందరు ఫిలిం మేకర్స్ సినిమాల విడుదల విషయంలో వెనక్కి తగ్గుతున్నారు. దీనికి తోడు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఐపీఎల్ గండం ఉండనే వుంది. ఈసారి మేజర్ క్రికెట్ టోర్నీ మార్చి చివర్లో ప్రారంభమై, మే 26 వరకూ జరగనుంది. IPL మ్యాచులకు ఇండియాలో ఎలాంటి ఆదరణ ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవి గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ కలెక్షన్లపై గట్టిగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఈవినింగ్, నైట్ షోలు, వీకెండ్ వసూళ్లపై బాగా ఎఫెక్ట్ పడుతోంది. ఇవన్నీ ఆలోచించుకునే భారీ చిత్రాలని ఈ సమ్మర్ లో రిలీజ్ చేయటానికి వెనకడుగు వేస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకోడానికి చిన్న, మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాలు ప్రయత్నిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో టాలీవుడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.