భయపడుతున్న సమంత?
ఐతే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆమె మా ఇంటి బంగారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
By: Garuda Media | 29 April 2026 11:42 PM ISTఒకప్పుడు టాలీవుడ్ అనే కాక సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగిన సమంత.. కొన్నేళ్ల నుంచి కథానాయికగా సినిమాలు చేయట్లేదు. 2023లో వచ్చిన శాకుంతలం తర్వాత ఆమె వెండితెరపై కనిపించింది తాను ప్రొడ్యూస్ చేసిన శుభమ్ అనే చిన్న సినిమాలో ఒక క్యామియో పాత్రతోనే. ఐతే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆమె మా ఇంటి బంగారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
తన భర్త రాజ్ నిడిమోరు రచనా సహకారం అందించిన ఈ చిత్రానికి సమంత క్లోజ్ ఫ్రెండ్ అయిన నందిని రెడ్డి దర్శకురాలు. ఈ చిత్రాన్ని మే 14న రిలీజ్ చేయబోతున్నట్లు కొన్ని నెలల ముందే ప్రకటించారు. ఈ దిశగా ఇటీవల ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఒక పాట లాంచ్ చేశారు. వెన్నెల కిషోర్‌తో కలిసి ఒక ఫన్నీ ఇంటర్వ్యూ కూడా చేసింది సామ్. ఇదంతా చూస్తే మే 14న మా ఇంటి బంగారం పక్కాగా రిలీజవుతుందనే అనిపించింది.
కానీ ఇప్పుడు ఉన్నట్లుండి టీం ఆలోచన మారినట్లు తెలుస్తోంది. వేసవిలో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రభావం సినిమాలపై గట్టిగానే పడుతోంది. పెద్ద సినిమాలు ఇంతకుముందులా వేసవిలో విడుదల కాకపోవడానికి.. రిలీజవుతున్న చిత్రాలకు ఆశించిన వసూళ్లు రాకపోవడానికి ఐపీఎల్ ఓ ముఖ్య కారణంగా భావిస్తున్నారు. మే 14 అంటే ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు చివరి దశలో ఉంటాయి. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా నడుస్తుంటుంది. తర్వాత ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఉంటాయి.
కాబట్టి అప్పుడు యూత్ అంతా క్రికెట్‌కే అంకితమై ఉంటారనే ఆలోచనతో 14న రిలీజ్ చేయడానికి టీం తటపటాయిస్తోందట. టాక్సిక్ మూవీని జూన్ 4 నుంచి వాయిదా వేసిన నేపథ్యంలో ఆ డేట్‌ను తీసుకోవాలని సమంత అండ్ కో చూస్తోందట. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇది మంచి ఆలోచన అని చెప్పడంతో మా ఇంటి బంగారం చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ మేరకు ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రమోషన్లను కూడా టీం హోల్డ్ చేసినట్లు సమాచారం.
