పోరాటాలను ఎదుర్కొని జీవితంలో నిలబడిన మమత
వ్యక్తిగత జీవితంలో జరిగిన విడాకులు కూడా ఆమెకు మానసికంగా కఠిన దశనే. అయినప్పటికీ, ఆ అనుభవాన్ని ఆమె బహిరంగంగా అంగీకరించి ముందుకు సాగారు.
By: Sravani Lakshmi Srungarapu | 12 Feb 2026 5:00 PM ISTమలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మమతా మోహన్‌దాస్ జీవిత ప్రయాణం నిజంగా పట్టుదల, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఆమె సినీ ప్రవేశం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, ఆ ఆరంభ వైఫల్యం ఆమెను వెనుకడుగు వేయనీయలేదు. మమతా మొదటి సినిమా భారీ ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ, తన ప్రతిభ, కృషితో మాలీవుడ్‌లో ప్రముఖ నటిగా మాత్రమే కాకుండా గాయని గానూ గుర్తింపు అందుకున్నారు. కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన నిరాశను ఆమె విజయానికి మెట్టుగా మార్చుకోవడం విశేషం.
రెండుసార్లు క్యాన్సర్ ను జయించిన మమత
కేవలం వృత్తిపరమైన సవాళ్లే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ మమతా అనేక కఠిన పరీక్షలను ఎదుర్కొన్నారు. 2009లో ఆమెకు క్యాన్సర్ నిర్ధారణ కావడం ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది. కీమోథెరపీ కారణంగా జుట్టు కోల్పోయిన దశను కూడా మమతా స్వీకరించి, ధైర్యంగా ముందుకెళ్లారు. ట్రీట్‌మెంట్ తర్వాత కోలుకుని మళ్లీ సినిమాల్లోకి రావడం ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. తర్వాత మరోసారి క్యాన్సర్‌ను ఎదుర్కొని దానిని కూడా మమత జయించారు. ఈ విషయాలను మమతనే స్వయంగా పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. 2019లో మారథాన్‌లో పాల్గొన్న ఫోటోలు ఆమె శారీరక, మానసిక దృఢత్వానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి.
వ్యక్తిగతంగానూ ఎన్నో సవాళ్లు
వ్యక్తిగత జీవితంలో జరిగిన విడాకులు కూడా ఆమెకు మానసికంగా కఠిన దశనే. అయినప్పటికీ, ఆ అనుభవాన్ని ఆమె బహిరంగంగా అంగీకరించి ముందుకు సాగారు. వ్యక్తిగత బాధలను వృత్తి జీవితంపై ప్రభావం చూపనివ్వకుండా ముందుకు సాగడం ఆమె ప్రత్యేకతగా చెప్పాలి. ఇటీవల ఆమె విటిలిగోతో జీవిస్తున్న విషయాన్ని కూడా ధైర్యంగా వెల్లడించారు. చేతిపై కనిపించే మచ్చలను దాచకుండా సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా శరీర మార్పులను అంగీకరించే ధోరణిని ప్రోత్సహించారు.
మమతా మోహన్‌దాస్ కథ కేవలం ఓ సినీ నటి విజయగాథ మాత్రమే కాదు, అది జీవితంలోని కష్టాలను ఎదుర్కొని మళ్లీ నిలబడే స్ఫూర్తిదాయక ప్రయాణం. కెరీర్ ప్రారంభ వైఫల్యం, ప్రాణాంతక వ్యాధితో పోరాటం, వ్యక్తిగత విఘాతం.. ఈ మూడు పెద్ద పరీక్షలను ఆమె విజయవంతంగా అధిగమించారు. అందుకే ఆమె ప్రయాణం సహనానికి, ఆత్మస్థైర్యానికి ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది.
