Begin typing your search above and press return to search.

మ‌రో భార‌త్-పాక్ వార్ తెర‌పైకి!

తాజాగా బాలీవుడ్ లో మ‌రో భార‌త్-పాక్ వార్ తెర‌పైకి రాబోతుంది. ఆప‌రేషన్ ట్రైడెంట్ పేరుతో రూపొందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 April 2024 12:30 PM GMT
మ‌రో భార‌త్-పాక్ వార్ తెర‌పైకి!
X

భార‌త్ -పాకిస్తాన్ వార్ నేప‌థ్యంలో బాలీవుడ్ లో ఎన్నో సినిమాలొచ్చాయి. త్రివిధ ద‌ళాల నేప‌థ్యాన్ని ఆధారంగా చేసుకుని రెండు దేశాల మ‌ధ్య వార్ వ‌స్తే ఎలా ఉంటుంది? భార‌త్ బ‌లం ఎంత‌? పాక్ బ‌లం ఎంత‌? అన్న‌ది ఎన్నో సినిమాల్లో చూపించారు. ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు మాలీవుడ్ నుంచి కూడా జ‌రిగాయి. స్పై బ్యాక్ డ్రాప్ లో ఇంకెన్నో తెర‌కెక్కాయి. వైఆర్ ఎఫ్ బ్యాన‌ర్ స్పై నేప‌థ్యంలో అయితే పేటేంట్ హ‌క్కులు మావే అన్న‌ట్లు ఎన్నో సినిమాలు నిర్మించింది. ప్ర‌స్తుతం ఇదే బ్యాక్ డ్రాప్ వార్ -2 కూడా తెర‌కెక్కుతుంది.

ఇక స‌బ్ మెరైన్ బ్యాక్ డ్రాప్ లో అయితే తెలుగు నుంచి....ఇండియా నుంచి రిలీజ్ అయిన ఏకైక చిత్రం 'ఘాజీ' ఒక్క‌టే. రానా ప్ర‌ధాన పాత్ర‌లో సంక‌ల్ప్ రెడ్డి తెరెక్కించిన ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును అందుకుంది. రిలీజ్ అనంత‌రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. మంచి విజ‌యాన్ని సాధించింది. స‌బ్ మెరైన బ్యాక్ డ్రాప్ లో రిలీజ్ అయిన ఒకే ఒక్క చిత్రం కూడా ఇదే. అదీ తెలుగు నుంచి రిలీజ్ అవ్వ‌డం విశేషం. తాజాగా బాలీవుడ్ లో మ‌రో భార‌త్-పాక్ వార్ తెర‌పైకి రాబోతుంది. ఆప‌రేషన్ ట్రైడెంట్ పేరుతో రూపొందిస్తున్నారు.

1971 లో భార‌త నావికాద‌ళం పాకిస్తాన్ ఓడరేవు న‌గ‌రం కరాచీపై చేసిన దాడి సంఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కి స్తున్నారు. ప‌ర్హాన్ అక్త‌ర్-రితేష్ సిద్వాణీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చారిత్రక విజ‌యం రాబోయే త‌రాలకు స్పూర్తినిచ్చేలా ఉంటుందంటూ నిర్మాణ సంస్థ నుంచి ఓ పోస్ట్ రిలీజ్ అయింది. 1971 లోజ‌రిగిన ఈ వార్ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. యుద్ద స‌మ‌యంలో భార‌త నావికాద‌ళం చేప‌ట్టిన సాహ‌సోపేత‌మైన దాడి ఇది.

ఈ నేప‌థ్యంలో ఘాజీ త‌ర్వాత స‌ముద్రం నేప‌థ్యంలో రాబోతున్న సినిమా ఇదే న‌ని తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి ఎవ‌రు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తారు? న‌టీన‌టులు ఎవ‌రు? అన్న వివ‌రాలు మాత్రం ఇంకా రివీల్ చేయ‌లేదు. కానీ ఈ చిత్రం దేశం గ‌ర్వించేలా గొప్ప‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. దాయాదిపై చేస్తోన్న సినిమా కావ‌డంతో సోష‌ల్ మీడియా వేద‌కిగా పెద్ద ఎత్తున విషెస్ జోరు క‌నిపిస్తుంది.