Begin typing your search above and press return to search.

ఐదు ద‌శాబ్ధాల్లో భార‌తీయ సినిమా గేమ్ ఛేంజ‌ర్స్

అందులో ముఖ్యంగా అమితాబ్ బ‌చ్చ‌న్ 'షోలే' ఉంటుంది. అలాగే మోడ్ర‌న్ ట్రెండ్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'బాహుబ‌లి' కూడా ప్ర‌ముఖంగా జాబితాలో నిలుస్తుంది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 3:30 AM GMT
ఐదు ద‌శాబ్ధాల్లో భార‌తీయ సినిమా గేమ్ ఛేంజ‌ర్స్
X

గ‌డిచిన ఐదు ద‌శాబ్ధాల్లో భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో గేమ్ ఛేంజ‌ర్స్ గా నిలిచి, దేశంలోని సినీ ప‌రిశ్ర‌మ‌ల్ని కొత్త మ‌లుపులు తిప్పిన సినిమాల గురించి చెప్పాల్సి వ‌స్తే.. అందులో ముఖ్యంగా అమితాబ్ బ‌చ్చ‌న్ 'షోలే' ఉంటుంది. అలాగే మోడ్ర‌న్ ట్రెండ్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'బాహుబ‌లి' కూడా ప్ర‌ముఖంగా జాబితాలో నిలుస్తుంది.

ఈ మ‌ధ్య‌లో చాలా సినిమాలొచ్చాయి. బ్లాక్ బ‌స్ట‌ర్లు, జాతీయ అవార్డుల‌తో గొప్ప సంచ‌ల‌నాలుగా నిలిచిన చిత్రాలు ఉన్నాయి. కానీ వాటిలోంచి సెల‌క్టివ్ గా చూస్తే ఆర్డ‌ర్ ఇలా ఉంది. షోలే (1975), దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే (డిడిఎల్‌జే) (1995), గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ (2001), రంగ్ దే బ‌సంతి (2006), ల‌గాన్ (2001), గ‌ల్లీ బోయ్ (2019), బాహుబ‌లి (2015) .. ఆయా సీజ‌న్ల‌లో సంచ‌ల‌నాలుగా నిలిచాయి.

అమితాబ్ న‌టించిన 'షోలే' చిత్రం కొన్ని ద‌శాబ్ధాల పాటు చ‌ర్చ‌ల్లో నిలిచింది. ఇందులో కంటెంట్, హీరోయిజం, న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌, సంగీతం, ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ప్ర‌తిదీ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. చాలా మంది ఔత్సాహిక న‌టీన‌టుల‌కు స్ఫూర్తిగా నిల‌వ‌డ‌మే గాక‌, ఫిలింస్కూల్ విద్యార్థుల‌కు ఇది ఒక పాఠంగా మారింది. అమితాబ్ ని పెద్ద స్టార్‌ని చేసిన ఈ సినిమా ఎప్ప‌టికీ క్లాసిక్స్ జాబితాలో ఉంటుంది. షారూఖ్ కెరీర్ లోనే కాకుండా భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో గొప్ప రొమాంటిక్ ల‌వ్ స్టోరిగా డిడిఎల్‌జే సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు తిర‌గ‌రాసిన ఈ చిత్రం భార‌తీయ సినిమా గ‌తిని మార్చింద‌ని చెప్పాలి. ఇందులో షారూఖ్‌-కాజోల్ పెయిర్ న‌ట‌న‌కు, అద్భుత‌మైన పాట‌ల‌కు గొప్ప పేరొచ్చింది. క‌ల్ట్ జాన‌ర్ లో వ‌చ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ జాన‌ర్ ప‌రంగా గొప్ప కొత్త‌ద‌నాన్ని ఆవిష్క‌రించిన సినిమా. అమీర్ ఖాన్ న‌టించిన రంగ్ దే బ‌సంతి, ల‌గాన్ చిత్రాలు చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసాయి.

స్వాతంత్య్ర‌ సమరయోధులపై ఒక డాక్యుమెంటరీని చిత్రీకరించడానికి భార‌త‌దేశానికి వ‌చ్చిన‌ ఒక ఆంగ్ల మహిళకు సహాయం చేసిన ఆరుగురు భారతీయ యువకుల కథేమిట‌న్న‌ది 'రంగ్ దే బ‌సంతి'. వారు చాలాకాలంగా మరచిపోయిన స్వాతంత్య్ర‌ గాథను తిరిగి పొందేందుకు దారితీసిన సంఘటనలను తెర‌పై చూపారు. భారతదేశంలోని ఒక చిన్న గ్రామ ప్రజలు క్రూరమైన బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా క్రికెట్ ఆటలో తమ భవిష్యత్తును పణంగా పెట్టిన క‌థేమిట‌న్న‌ది లగాన్ లో అశుతోష్ గోవారిక‌ర్ అద్బుతంగా ఆవిష్క‌రించారు. ఒక గ‌ల్లీ నుంచి వ‌చ్చిన కుర్రాడు అంత‌ర్జాతాయ స్టార్ ఎలా అయ్యాడు? అన్న‌ది గ‌ల్లీబోయ్ లో జోయా అక్త‌ర్ అద్భుతంగా పోయెటిక్ గా ఆవిష్క‌రించారు. ఈ సినిమాల‌న్నీ జాతీయ అవార్డుల్ని గెలుచుకోవ‌డ‌మే గాక‌, క‌మ‌ర్షియ‌ల్ గా బాక్సాఫీస్ వ‌ద్ద గొప్ప‌గా రాణించాయి.

ఇక బాహుబ‌లి గురించి మాట్లాడాలంటే అది ఒక గ్రంధం అవుతుంది. 'బాహుబ‌లి ముందు బాహుబ‌లి త‌ర్వాత' ఇండియ‌న్ సినిమా సీన్ ఎలా మారిందో చూస్తున్న‌దే. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ కొల్ల‌గొట్టిన ఏకైక భార‌తీయ ప‌రిశ్ర‌మ‌గా టాలీవుడ్ పేరు మార్మోగుతోంది. వ‌రుస‌గా పాన్ ఇండియన్ సినిమాలు, పాన్ ఇండియ‌న్ స్టార్లు తెలుగు చిత్ర‌సీమ నుంచి పుట్టుకు వ‌స్తున్నారు అంటే దానికి ఆరంభం బాహుబ‌లి. దేశ సినిమా ద‌శ దిశ మార్చేసిన ఏకైక సినిమా ఏది? అంటే ఈ డికేడ్ లో బాహుబ‌లి గురించే చెప్పుకోవాలి. ఉత్త‌రాది, ద‌క్షిణాది రెండు చోట్లా భారీగా పాన్ ఇండియా సినిమాల వెల్లువ‌కు దారి చూపిన సినిమాగా బాహుబ‌లికి గుర్తింపు ద‌క్కుతోంది.

గ్యాంగ్ స్ట‌ర్ సినిమాల్లో ఆర్జీవీ 'స‌త్య', అమితాబ్ 'స‌ర్కార్' వంటి గొప్ప చిత్రాలు ఉన్నాయి. రొమాంటిక్ జాన‌ర్ స‌హా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ల‌లో డాన్ క‌థ‌ల‌తో మాఫియా గూండారాజ్ క‌థ‌ల‌తో వ‌చ్చిన‌ సినిమాలు చాలా ఉన్నాయి. కానీ కంటెంట్ ప‌రంగా అప్ప‌టి రికార్డుల ప‌రంగా చూసినా పైన పేర్కొన్న‌ అర‌డ‌జ‌ను చిత్రాలు వేటిక‌వే యూనిక్ అన్న టాక్ తెచ్చుకున్నాయి.

వీట‌న్నిటి కంటే ముందే మాయా బ‌జార్ భార‌తీయ సినిమా క‌లికితురాయిగా గుర్తింపు తెచ్చుకుంది. ప‌లు తెలుగు చిత్రాలు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో గొప్ప చిత్రాలుగా నిలిచాయి. అయితే అప్ప‌ట్లో జాతీయ సినిమాగా హిందీ ప‌రిశ్ర‌మ‌కు ఉన్న గుర్తింపు, ప్రాంతీయ‌తా డామినేష‌న్ ఇత‌ర భాష‌ల సినిమాల‌కు గుర్తింపును త‌గ్గించాయి.

తెలుగు-త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం నుంచి హిందీ భాష‌కు ధీటైన క్లాసిక్ హిట్ సినిమాలు చాలా వ‌చ్చినా కానీ, అప్ప‌ట్లో సౌత్ కి ఉన్న గుర్తింపు ప‌రిమితంగా ఉండేది. హిందీ సినిమా డామినేష‌న్ ఇటీవ‌ల త‌గ్గింది. సౌత్ నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల వెల్లువ రావడంతో ఇప్పుడు దేశీ సినీ ప‌రిశ్ర‌మ రేంజ్ అమాంతం మారింది.