Begin typing your search above and press return to search.

సేనాప‌తి ఈజ్ బ్యాక్.. అవినీతిప‌రుల గుండెల్లో భూకంపం!

ఈ స్వాతంత్య్ర దినోత్స‌వం కానుక‌గా శంక‌ర్ .. సేనాప‌తి కొత్త లుక్ ని విడుద‌ల చేసారు. అభిమానులకు స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

By:  Tupaki Desk   |   16 Aug 2023 3:53 AM GMT
సేనాప‌తి ఈజ్ బ్యాక్.. అవినీతిప‌రుల గుండెల్లో భూకంపం!
X

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న భార‌తీయుడు 2 (ఇండియ‌న్ 2) 2023-24 సీజ‌న్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒక‌టిగా పాపుల‌రైంది. అవినీతి రాజ‌కీయాల‌పై దండెత్తే సేనాప‌తిని ఈ చిత్రంలో శంక‌ర్ చూపించ‌నున్నారు. ఇప్ప‌టికే సేనాప‌తి లుక్ లు అంత‌ర్జాలంలో విడుద‌లై ఆక‌ట్టుకున్నాయి. రాజ‌మండ్రి జైలులోను ఈ సినిమాకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.


ఈ స్వాతంత్య్ర దినోత్స‌వం కానుక‌గా శంక‌ర్ .. సేనాప‌తి కొత్త లుక్ ని విడుద‌ల చేసారు. అభిమానులకు స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా నుండి అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఈ లుక్ వైర‌ల్ గా మారింది. ఈ కొత్త లుక్ పై ప్ర‌శంస‌లు కురిసాయి. శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేసిన ఈ పోస్టర్‌లో క‌మ‌ల్ హాస‌న్ సేనాప‌తి రూపం అమితంగా ఆక‌ర్షించింది. ఖాకీ యూనిఫాం ధరించి దానిపై భారత జెండా బ్యాడ్జ్ తో తీక్ష‌ణంగా చూస్తూ అత‌డు క‌నిపించాడు. త్రివర్ణ బెలూన్లు ఈ పోస్ట‌ర్ లో హైలైట్ గా క‌నిపించాయి. దీనిపై 'స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు' అని రాసి ఉంది. శంక‌ర్ ఈ ట్వీట్‌కు '#ఇండియన్ 2' అని క్యాప్షన్ ఇచ్చారు.

నెటిజన్లు కమల్ హాసన్ సేనాప‌తి లుక్ ని ప్రశంసిస్తూ అవినీతి ప‌రుల గుండెల్లో క‌త్తి పోటు ప‌డాల్సిందే అంటూ హుషారును వ్యక్తం చేశారు. 'పాన్-ఇండియా మెగా-బ్లాక్‌బస్టర్ రాబోతోంది' అని ఒక అభిమాని వ్యాఖ్య‌ను జోడించాడు. సేనాపతి ఈజ్ బ్యాక్ అని మరో అభిమాని వ్యాఖ్యానించారు. ''పర్ఫెక్ట్! ఏదో గొప్ప విషయం రాబోతుంది'' అని మరొకరు రాశారు. ''మీ క్రియేటివిటీ మేకింగ్ శైలి అద్భుతం సార్.. సేనాపతిగా కమల్ సర్ రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం. గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని వేరొక అభిమాని విషెస్ తెలిపాడు.

ఇండియన్ 2 1996లో వచ్చిన ఇండియన్ (భార‌తీయుడు) సినిమాకి సీక్వెల్. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో నటిస్తున్నారు. స్వాతంత్య్ర‌ సమరయోధుడు అవినీతి నేరాలకు వ్యతిరేకంగా పోరాడేవాడిగా క‌నిపిస్తాడు. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, నయనతార, ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్ తదితరులు నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.

ఈ చిత్రానికి లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన సుభాస్కరన్ అల్లిరాజా నిర్మాత‌. రెడ్ జెయింట్ మూవీస్ అధినాయ‌కుడు.. డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీ కం ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మద్దతు ఇచ్చారు. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ మరో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ క‌థ‌ను అందించిన ఈ చిత్రానికి గేమ్ ఛేంజర్ అనే పేరు పెట్టారు. ఈ పొలిటిక‌ల్ యాక్షన్ థ్రిల్లర్ లో కియారా అద్వానీ క‌థానాయిక‌. 2024లో విడుదల కానుంది.