Begin typing your search above and press return to search.

1950 నుంచి 2020 వరకు.. ఇండియాను మార్చిన టాప్ 3 డైరెక్టర్లు ఎవరు?

ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ హిస్ట‌రీను పరిశీలిస్తే ప్రతి దశాబ్దాన్ని కొంద‌రు ప్రత్యేక డైరెక్ట‌ర్లు తమ ఆలోచనలతో, కథన శైలితో, క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ల‌తో ప్రభావితం చేసిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   11 Jun 2026 6:00 AM IST
1950 నుంచి 2020 వరకు.. ఇండియాను మార్చిన టాప్ 3 డైరెక్టర్లు ఎవరు?
X

ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ హిస్ట‌రీను పరిశీలిస్తే ప్రతి దశాబ్దాన్ని కొంద‌రు ప్రత్యేక డైరెక్ట‌ర్లు తమ ఆలోచనలతో, కథన శైలితో, క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ల‌తో ప్రభావితం చేసిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ లిస్ట్ ఇప్పుడు సినీ అభిమానుల మధ్య ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. బాక్సాఫీస్ విజయాలు మరియు క‌ల్చ‌ర‌ల్ ఇంపాక్ట్ ను ప్రామాణికంగా తీసుకుని 1950ల నుంచి 2020ల వరకు ప్రతి దశాబ్దంలో అత్యంత ప్రభావవంతమైన ముగ్గురు డైరెక్ట‌ర్ల‌ను ఎంపిక చేస్తూ రూపొందించిన ఈ లిస్ట్‌పై నెటిజన్లు విస్తృతంగా చర్చిస్తున్నారు.

ముఖ్యంగా ఈ లిస్ట్ లో బాలీవుడ్ దిగ్గజాలతో పాటు సౌత్ డైరెక్ట‌ర్లు కూడా చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది. 1950లలో బిమల్ రాయ్, గురుదత్, మెహబూబ్ ఖాన్ వంటి డైరెక్ట‌ర్లు భారతీయ సినిమాకు కొత్త భాషను అందించగా, 1960లలో విజయ్ ఆనంద్, హృషీకేశ్ ముఖర్జీ, రాజ్ ఖోస్లా తమదైన ముద్ర వేశారు. 1970లలో యష్ చోప్రా, మన్మోహన్ దేశాయ్, రమేష్ సిప్పీ కమర్షియల్ సినిమాకు కొత్త నిర్వచనం ఇచ్చిన వారిగా గుర్తింపు పొందారు.

1980లలో సుభాష్ ఘాయ్, మహేష్ భట్, మీరా నాయర్ లాంటి డైరెక్ట‌ర్లు విభిన్న శైలులతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, 1990లలో రాజ్‌కుమార్ సంతోషి, సూరజ్ బర్జాత్యా, ఆదిత్య చోప్రా ఫ్యామిలీ స్టోరీస్, ప్రేమ కథలు, సోష‌ల్ మెసేజ్‌ల‌తో భారీ స‌క్సెస్‌లు అందుకున్నారు. ఇక 2000లలో రాజ్‌కుమార్ హిరాణి, సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్ బాలీవుడ్‌ను అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించిన దర్శకులుగా నిలిచారు.

అయితే ఎక్కువ చర్చకు కారణమైన కేట‌గిరీ మాత్రం 2010 మరియు 2020ల జాబితానే. 2010లలో రోహిత్ శెట్టి, సంజయ్ లీలా భన్సాలీతో పాటు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చోటు దక్కించుకోవడం అభిమానులను ఆనందపరుస్తోంది. ముఖ్యంగా బాహుబలి సిరీస్‌తో భారతీయ సినిమా మార్కెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన రాజమౌళి ప్రభావం ఈ ఎంపికలో ప్రధాన కారణంగా చెప్పబడుతోంది. అదే సమయంలో రోహిత్ శెట్టి కమర్షియల్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొత్త ట్రెండ్ సెట్ చేయగా, భన్సాలీ తన విజువల్ గ్రాండియర్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

ఇక ప్రస్తుత 2020ల దశాబ్దానికి సంబంధించిన లిస్ట్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో ఎస్.ఎస్. రాజమౌళితో పాటు ఆదిత్య ధర్, సందీప్ రెడ్డి వంగా పేర్లు ఉండటం విశేషం. ఆర్టికల్ 370, ఉరి వంటి సినిమాల‌తో ఆదిత్య ధర్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగా, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల‌తో సందీప్ రెడ్డి వంగా భారతీయ సినిమా చర్చల్లో కేంద్రబిందువుగా మారారు. అయితే ఈ లిస్ట్ పై ఏకాభిప్రాయం మాత్రం కనిపించడం లేదు. కొందరు మణిరత్నం, శంకర్, రామ్ గోపాల్ వర్మ, రిషికేష్ ముఖర్జీ వంటి దిగ్గజాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతుండగా, మరికొందరు బాక్సాఫీస్ మరియు సాంస్కృతిక ప్రభావం పరంగా చూస్తే ఈ ఎంపికలు సమంజసమేనని వాదిస్తున్నారు. మొత్తంగా చూస్తే, భారతీయ సినిమాను దశాబ్దాల వారీగా నిర్వచించిన దర్శకుల గురించి మరోసారి చర్చ మొదలయ్యేలా చేసిన ఈ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.