కెనడాలో ఘోరం: పంజాబీ యూట్యూబర్ దారుణ హత్య.. కత్తితో పొడిచి పొడిచి!
కెనడాలో భారతీయుల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన వెలుగు చూసింది.
By: Sivaji Kontham | 6 March 2026 12:05 AM ISTకెనడాలో భారతీయుల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన వెలుగు చూసింది. ఒంటారియో ప్రాంతంలో పంజాబీ మూలాలున్న 45 ఏళ్ల మహిళ నాన్సీ గ్రెవాల్‌ను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం రాత్రి (మార్చి 3) ఈ దారుణం జరిగింది. నాన్సీ గ్రెవాల్ ఒక పాపులర్ యూట్యూబర్ కూడా కావడంతో ఈ వార్త కెనడాలోని భారతీయ సమాజంలో అలాగే, భారతదేశంలోని పంజాబ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.
లాసాల్లే పోలీస్ సర్వీస్ అందించిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో టోడ్ లేన్ 2400 బ్లాక్ ప్రాంతంలో ఒక మహిళపై కత్తితో దాడి జరిగినట్లు సమాచారం అందింది. పోలీసులు, పారామెడికల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికే నాన్సీ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా కానీ.. తీవ్ర గాయాల కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం ఈ కేసును పోలీసులు అత్యంత సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. నాన్సీ గ్రెవాల్‌పై దాడి చేయడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఆమె వ్యక్తిగత కక్షల వల్ల హత్యకు గురయ్యారా లేక ఇది జాతి వివక్షతో కూడిన దాడి అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. పరిసరాల్లోని సిసిటివి దృశ్యాలను సేకరించి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కెనడాలో ఇటీవలి కాలంలో భారతీయులే లక్ష్యంగా దాడులు పెరుగుతున్న తరుణంలో ఈ హత్య జరగడం గమనార్హం. ముఖ్యంగా పంజాబీ కమ్యూనిటీలో మంచి గుర్తింపు ఉన్న యూట్యూబర్ ఇలా దారుణ హత్యకు గురికావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భారత విదేశాంగ శాఖ ఈ ఘటనపై స్పందించి.. నిందితులకు కఠిన శిక్ష పడేలా కెనడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బాధితురాలి బంధువులు కోరుతున్నారు.
కెనడాలో భారతీయ మహిళలపై పెరుగుతున్న హింస
ఇటీవలి కాలంలో కెనడాలో భారతీయ మహిళలపై దౌర్జన్యాలు, హత్యలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఉన్నత చదువుల కోసం లేదా మెరుగైన ఉపాధి కోసం అక్కడికి వెళ్తున్న మహిళలు స్థానిక ముఠాల దాడులకు లేదా జాతి వివక్ష వేధింపులకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా జరిగిన వరుస ఘటనల్లో యువతులు, గృహిణులు నివాసాల వద్దే దాడులకు గురవ్వడం, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు ఎదుర్కోవడం గమనార్హం. కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతల క్షీణత, భారత్-కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కూడా ఇండైరెక్ట్‌గా ఇలాంటి నేరాలు పెరగడానికి కారణమవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు భారతీయ సంతతికి చెందిన మహిళలు అక్కడ ఒంటరిగా ప్రయాణించేటప్పుడు లేదా రాత్రి సమయాల్లో బయటకు వచ్చేటప్పుడు భయం భయంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం భౌతిక దాడులే కాకుండా, ఆన్‌లైన్ వేదికగా కూడా భారతీయ మహిళా క్రియేటర్లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడటం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో కెనడాలోని భారత రాయబార కార్యాలయం తమ పౌరులకు ఎప్పటికప్పుడు భద్రతా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.
కపిల్ శర్మ కేఫ్‌పై దాడి
కెనడాలో భారతీయుల ఆస్తులే లక్ష్యంగా జరుగుతున్న దాడుల పరంపరలో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మకు చెందిన కేఫ్ కూడా బాధితురాలిగా మారింది. గుర్తుతెలియని దుండగులు కపిల్ శర్మ కేఫ్‌పై విచక్షణారహితంగా దాడులు చేసి ఆస్తి నష్టం కలిగించారు. కేఫ్ అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా, భారతీయ వ్యతిరేక నినాదాలు చేస్తూ అక్కడి వాతావరణాన్ని భయానకంగా మార్చారు. ఈ ఘటన కెనడాలోని భారతీయ వ్యాపారవేత్తల భద్రతపై పెద్ద ఎత్తున ప్రశ్నలను లేవనెత్తింది.
