పురాణాల్లో మనల్ని కొట్టేదెవరు?
ఇప్పుడు ‘ఆదిపురుష్’ను మరిపించి.. రామాయణ గాథ ఔన్నత్యాన్ని ఇప్పటి ప్రేక్షకులకు తెలియజేస్తుందని భావించిన ‘రామాయణ’ సైతం లేటెస్ట్ ప్రోమోతో మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
By: Garuda Media | 6 April 2026 3:00 PM ISTదేవుళ్ల మీద, పురాణాల మీద సినిమాలు తీసి క్యాష్ చేసుకుందామని ఈ తరం దర్శక నిర్మాతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పురాణ గాథల్ని ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని చూస్తున్నారు కానీ.. ఈ క్రమంలో ఆ కథల్లోని ఆత్మను పట్టుకోలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. భారతీయ పురాణ గాథల్లో అత్యద్భుతం అనదగ్గ ‘రామాయణం’ మీద కొన్నేళ్ల ముందు ‘ఆదిపురుష్’ పేరుతో సినిమా తీశాడు బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రౌత్. కానీ అది చివరికి ఒక ట్రోల్ మెటీరియల్‌గా మారిపోయింది. ఆ సినిమా మీద పెట్టిన వందల కోట్ల బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరయింది. అందులో విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఇప్పుడు ‘ఆదిపురుష్’ను మరిపించి.. రామాయణ గాథ ఔన్నత్యాన్ని ఇప్పటి ప్రేక్షకులకు తెలియజేస్తుందని భావించిన ‘రామాయణ’ సైతం లేటెస్ట్ ప్రోమోతో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇటీవల రిలీజ్ చేసిన రాముడి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇందులో కూడా ‘ఆదిపురుష్’ తాలూకు కృత్రిమత్వం కొంత కనిపించింది. రాముడిగా రణబీర్ లుక్ విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉన్నట్లుండి ఈ సినిమా పట్ల నెగెటివిటీ ముసురుకుంది.
ఇప్పుడు ఎలాంటి ఊహకైనా దృశ్య రూపం ఇవ్వగలిగే అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉంది. వందలు, వేల కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాతలు ఉన్నారు. ఇవన్నీ ఉండి ఏం లాభం? కథలోని ఆత్మను పట్టుకోవడం ఇప్పటి ఫిలిం మేకర్స్ ఫెయిలవుతున్నారు. ముఖ్యంగా పురాణ గాథలను తెరకెక్కించడంలో బాలీవుడ్ బలహీనత స్పష్టంగా బయటపడిపోతోంది. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమను కొట్టే ఇండస్ట్రీ ప్రపంచంలో మరెక్కడా లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యద్భుతమైన మైథాలజీ సినిమాలను అందించిన ఘనత టాలీవుడ్‌దే. ఈ విషయంలో బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా ఏ వుడ్డూ మన దరిదాపుల్లో నిలవలేదు.
రామాయణ గాథ నేపథ్యంలోనే ‘సంపూర్ణ రామాయణం’, ‘లవకుశ’, ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’.. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి తెలుగులో. ఇక మహాభారతం నేపథ్యంలోనూ నర్తనశాల, పాండవ వనవాసము, మాయాబజార్,శ్రీ కృష్ణార్జున యుద్ధం, దానవీర శూరకర్ణ సహా ఎన్నో ల్యాండ్ మార్క్ మూవీస్ తీశారు మన దర్శకులు. మైథాలజీలు ఆగిపోయిన టైంలోనూ బాలభారతం, శ్రీరామరాజ్యం లాంటి చిత్రాలు తర్వాతి తరం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మోడర్న్ ఫిలిం మేకర్స్ సైతం మైథాలజీలు తీయడంలో తామేమీ తక్కువ కాదని రుజువు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ‘కల్కి’లో కర్ణుడి పార్ట్‌ను నాగ్ అశ్విన్ ఎంత బాగా తీర్చిదిద్దాడో తెలిసిందే. ‘హనుమాన్’లో హనుమంతుడి పాత్రను కాసేపు చూపించి గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ‘జై హనుమాన్’ రూపంలో ఆ పాత్ర మీద ఫుల్ లెంత్ మూవీ తీస్తున్నాడు.
మరోవైపు ‘యమదొంగ’లో యమలోక సన్నివేశాలను భలేగా తీర్చిదిద్దని ఇప్పుడు రాజమౌళి ‘వారణాసి’లో త్రేతాయుగం నేపథ్యంలో తీసే ఎపిసోడ్‌ను వేరే లెవెల్లో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, అవసరం లేని క్రియేటివిటీ కంటే.. పురాణ గాథల్లోని గొప్పదనాన్ని అర్థం చేసుకుని.. అందులోని ఆత్మను పట్టుకుని ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచడంలో మన ఫిలిం మేకర్స్ స్థాయి వేరు. ఒకప్పటి ఘన వారసత్వాన్ని ఇప్పటి దర్శకులు కూడా కొనసాగించగలమనే భరోసాను ఇస్తున్నారు. రేప్పొద్దున రాజమౌళి ‘మహాభారతం’ తీస్తే అప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతా ఆయనకు సలాం కొట్టడం.. భారతీయ ప్రేక్షకులంతా వెండితెరలకు దాసోహం అనడం ఖాయం.
