హీరోలకు ధీటుగా విలన్ పాత్రలు: మారిన ట్రెండ్!
అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎప్పుడూ విలన్ పాత్రలను పవర్ ఫుల్‌గా తీర్చిదిద్దుతారని పేరుంది.
By: Tupaki Desk | 5 Sept 2026 9:00 PM ISTఒకప్పుడు భారతీయ సినిమాలో విలన్ అంటే హీరో చేతిలో దెబ్బలు తినడానికి.. చివర్లో అంతమవ్వడానికి మాత్రమే పరిమితమయ్యే పాత్ర. కానీ ఇప్పటి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కథలో విలన్ ఎంత శక్తివంతంగా ఉంటే? ఆ విలన్‌ను ఢీకొట్టే హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుందనే సూత్రాన్ని నేటి దర్శకులు బలంగా నమ్ముతున్నారు. హీరో పాత్రకు ఏమాత్రం తీసిపోని రీతిలో.. సవాలు విసిరే విధంగా విలన్ పాత్రలకు ప్రాణం పోస్తుండటంతో ఇండియన్ సినిమాలో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది.
ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న భారీ చిత్రం `పారడైజ్` పై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో నానికి పోటీగా ప్రతికూల ఛాయలున్న పవర్ ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జూయల్ విక్రమ్ మాలిక్ అనే పాత్రలో నటిస్తున్నారు. సాధారణంగా విలన్ పాత్రలలో కనిపించని రాఘవ్ ఈ చిత్రంలో ఎంతటి క్రూరమైన నటనకు ప్రాధాన్యమున్న పాత్ర పోషిస్తున్నారో మేకర్స్ ఇస్తున్న లీక్స్ ను బట్టే తెలుస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎప్పుడూ విలన్ పాత్రలను పవర్ ఫుల్‌గా తీర్చిదిద్దుతారని పేరుంది. ఆయన తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి`లో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా అనే ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు. హీరోకు తగ్గట్లే సమానమైన బలంతో, ఆధిపత్యం ప్రదర్శించే పాత్రగా కుంభా క్యారెక్టర్ రూపుదిద్దుకుంటోంది.
అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ `సలార్ 2`లోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కొనసాగుతున్నారు. ప్రభాస్ పాత్రకు సరిసమానమైన స్క్రీన్ ప్రెజెన్స్, ఫ్రెండ్‌షిప్ నుంచి శత్రుత్వంలోకి మారే క్రమంలో ఉండే భావోద్వేగాలను పృథ్వీరాజ్ పవర్‌ఫుల్ నటనతో పండించబోతున్నారు. ఇంకా `కల్కి 2` లో లోకనాయకుడు కమల్ హాసన్ యాస్కిన్ పాత్రలో పూర్తిస్థాయి విశ్వరూపం చూపించనున్నారు.
ఈ పాత్ర గనుక పండితే? కమల్ ఇమేజ్ కొత్త కోణంలో హైలైట్ అవుతుంది.
ఇలా సౌత్ స్టార్లనే విలన్లుగా చూపించడం సినిమా స్థాయిని మరింత పెంచుతోంది. ఈ ట్రెండ్ వల్ల వేర్వేరు భాషలకు చెందిన స్టార్ నటులు ఒకే వేదికపైకి రావడం సాధ్యమవుతోంది. ఇది సినిమా బాక్సాఫీస్ మార్కెట్‌ను పెంచడమే కాకుండా ప్రేక్షకులకు సరికొత్త విజువల్ అనుభూతిని ఇస్తోంది. విలన్ పాత్రలు భయాన్ని కలిగించడమే కాకుండా వారి నటనతో ప్రేక్షకులను మెప్పించి కథను నడిపించే శక్తులుగా మారుతున్నాయి.
అంతిమంగా ఇండియన్ సినిమాలో హీరో-విలన్ల మధ్య పోరు కొట్లాటలకు పరిమితం కాలేదు. మైండ్ గేమ్‌లు - నటనతో పోటీపడే స్థాయికి చేరింది. విలనిజానికి లభిస్తున్న ప్రాధాన్యత భవిష్యత్ లో మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు వెండితెరకు రావడానికి మార్గం సుగమం చేస్తోందని చెప్పొచ్చు.
