పాక్‌ని కొట్టినట్టు పైరసీని కొట్టలేమా?
భారతీయ సినీపరిశ్రమల్ని దశాబ్ధాలుగా పైరసీ వేధిస్తున్నా, ఈ ప్రమాదకర భూతాన్ని అంతం చేయలేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
By: Tupaki Desk | 18 May 2025 10:00 PM ISTభారతీయ సినీపరిశ్రమల్ని దశాబ్ధాలుగా పైరసీ వేధిస్తున్నా, ఈ ప్రమాదకర భూతాన్ని అంతం చేయలేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. టొరెంట్ లింకులు యథేచ్ఛగా కొత్త సినిమాలను హెచ్.డి లో రిలీజ్ చేస్తున్నాయి. పైరసీ మాఫియా నిరంతరం తమ పని తాము చేసుకుపోతూనే ఉంది. ఇతర సినీపరిశ్రమల సంగతి ఏమో కానీ, భారతీయ సినీపరిశ్రమలు పైరసీ వల్ల యేటేటా వందల కోట్లు నష్టపోతుండడం విస్మయపరుస్తోంది. అసలు దీని వెనక ఎవరున్నారు? అన్నది అంతుచిక్కని సమస్యగా మారింది.
ఇటీవలి భారీ చిత్రాలు కల్కి 2898 ఏడి, పుష్ప సహా మొన్నటికి మొన్న విడుదలైన చిన్న సినిమాలు శుభం, కోర్ట్, సింగిల్ వంటి చిత్రాలను పైరసీలో రిలీజ్ చేసేయడంతో నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. పెద్ద సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా విడుదలై తొలి మూడు రోజుల నుంచి తొలి వారంలోనే మొత్తం పెట్టుబడుల్ని లాక్కుంటున్నాయి. కానీ చిన్న సినిమాలు అలా కాదు.. ఇవి నెమ్మదిగా జనాలకు కనెక్టవ్వాలి. పైగా పరిమిత థియేటర్లలో, కేవలం కొన్ని ప్రాంతాల్లోనే విడుదలవుతాయి కాబట్టి ఈ సినిమాల గురించి కూడా ఎవరికీ తెలీదు. థియేటర్ల నుంచి రాబట్టే ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. కానీ ఇలాంటి సినిమాలను కూడా పైరసీకారులు టొరెంట్లలో ప్రపంచ దేశాలకు అందించడం చూస్తుంటే షాక్ కి గురవ్వని వారు లేరు.
అసలు మన దేశంలో పైరసీ అంతానికి ఆట్టర్నేట్ సొల్యూషన్ ఏదీ లేదా? అన్నదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఆపరేషన్ సిందూర్ టైమ్ లో పాకిస్తానీ వెబ్ సైట్లు, యూట్యూబ్ లు మొత్తం ఇండియా ప్రభుత్వం బ్లాక్ చేసింది. కానీ భారతదేశంలో ప్రతి సినీపరిశ్రమ నిరంతరం పైరసీకి గురై తీవ్రంగా నష్టపోతున్నా కానీ, పైరసీ వెబ్ సైట్లను ప్రభుత్వాలు ఎందుకు బ్లాక్ చేయడం లేదు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే పైరసీ సైట్లను ఆపేయలేవా? ఎందుకు ఆ పని చేయడం లేదు?
