ఓవర్సీస్‌లో 200 కోట్ల క్లబ్: బాక్సాఫీస్ వద్ద మనదే హవా
భారతీయ చిత్ర పరిశ్రమ గ్లోబల్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఒకప్పుడు విదేశీ మార్కెట్ అంటే కేవలం బాలీవుడ్ చిత్రాలకే పరిమితం అనుకునేవారు.
By: Sivaji Kontham | 14 April 2026 8:24 AM ISTభారతీయ చిత్ర పరిశ్రమ గ్లోబల్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఒకప్పుడు విదేశీ మార్కెట్ అంటే కేవలం బాలీవుడ్ చిత్రాలకే పరిమితం అనుకునేవారు. కానీ గడిచిన ఏడెనిమిదేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓవర్సీస్ మార్కెట్‌లో 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం నిజంగా సంచలనం. ఇటీవలి 10ఏళ్లలో ఓవర్సీస్ లో 200 కోట్లు వసూలు చేసిన భారతీయ సినిమాల జాబితాను పరిశీలిస్తే.. అందులో సౌత్ సినిమాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి నాలుగు చిత్రాలు ఈ ప్రతిష్టాత్మకమైన క్లబ్‌లో చేరడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా భారతీయ కంటెంట్‌కు పెరుగుతున్న ఆదరణకు ఈ వసూళ్లే నిదర్శనంగా నిలుస్తుండగా రాజమౌళి `వారణాసి` చిత్రంతో మరో బెంచ్ మార్క్ వసూళ్లను సాధించడం సాధ్యమేననే అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఈ జాబితాలో అగ్రస్థానంలో అమీర్ ఖాన్ నటించిన `దంగల్` నిలిచింది. ముఖ్యంగా చైనా మార్కెట్‌లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం వల్ల ఓవర్సీస్‌లో సుమారు రూ.1435 కోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించింది. అలాగే `సీక్రెట్ సూపర్ స్టార్`, `బజరంగీ భైజాన్` వంటి చిత్రాలు కూడా చైనా మార్కెట్ పుణ్యమా అని భారీ వసూళ్లను రాబట్టాయి. అయితే చైనాతో సంబంధం లేకుండానే అమెరికా, జపాన్, యూరప్ దేశాలలో మన సౌత్ సినిమాలు సంచలన వసూళ్లను నమోదు చేస్తున్నాయి. షారూఖ్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాలతో ఓవర్సీస్ లో సత్తా చాటినా కానీ అంతకుముందే దక్షిణాది చిత్రాలు విదేశాల్లో బాక్సాఫీస్ కింగ్ అని నిరూపించాయి.
సౌత్ ఇండియా నుంచి దాదాపు అరడజను సినిమాలు రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 సుమారు రూ.370 కోట్లతో అగ్రపథంలో ఉండగా.. `ఆర్ఆర్ఆర్` చిత్రం జపాన్ , అమెరికాలో అద్భుతమైన వసూళ్లను సాధించి రూ. 310 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన `కేజీఎఫ్ చాప్టర్ 2`, తమిళ చిత్రం `లియో` కూడా విదేశీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ప్రభాస్ నటించిన `సలార్: పార్ట్ 1` కూడా విదేశాల్లో భారీ ఆదరణ పొంది ఈ జాబితాలో చేరింది.
ఈ వసూళ్ల గణాంకాలను గమనిస్తే... బాలీవుడ్ అగ్ర హీరోలైన అమీర్ ఖాన్ - షారూఖ్ ఖాన్ చిత్రాలకు ధీటుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు విదేశాల్లో అత్యధిక క్రేజ్ ఉందని స్పష్టమవుతోంది. ప్రభాస్ నటించిన వరుస చిత్రాలు ఓవర్సీస్ మార్కెట్‌లో మినిమం గ్యారెంటీ వసూళ్లను సాధిస్తున్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు లేదా హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు విదేశీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` కూడా విడుదలైన అతి తక్కువ సమయంలోనే 200 కోట్ల ఓవర్సీస్ క్లబ్‌లో చేరి టాలీవుడ్ ఖ్యాతిని మరోసారి చాటిచెప్పింది. అయితే బాలీవుడ్ లో దురంధర్ ఫ్రాంఛైజీ ఇంటా బయటా సంచలనాలు నమోదు చేసింది. ఇటీవలే విడుదలైన దురంధర్, దురంధర్ 2 చిత్రాలు కూడా ఓవర్సీస్ లో 200 కోట్ల క్లబ్ లను అందుకున్నాయి.
భవిష్యత్తులో రానున్న భారీ ప్రాజెక్టుల వల్ల ఓవర్సీస్ మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉంది. కేవలం భారతీయ మూలాలు ఉన్నవారే కాకుండా... అమెరికా సహా ప్రపంచ దేశాల్లో స్థానికులు కూడా మన సినిమాలపై ఆసక్తి చూపుతుండటం గమనార్హం. భారతీయ సినిమా ఇప్పుడు గ్లోబల్ ప్లాట్‌ఫామ్ మీద తన ముద్రను బలంగా వేస్తోంది. బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు క్రిటికల్ గాను హాలీవుడ్ ని సమం చేసి లేదా అధిగమించి ముందుకు దూసుకెళ్లాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
