Begin typing your search above and press return to search.

ఇండియా న్యూ వేవ్ సినిమా: ఆర్టిఫిషియల్ డ్రామా క్రియేట‌ర్ల‌కు కాలం చెల్లు!

ఈ `న్యూ వేవ్`లో కథాంశాలు కూడా మారుతున్నాయి. భౌగోళిక రాజకీయాలు, దేశభక్తి అంశాలతో కూడిన పొలిటికల్ థ్రిల్లర్లకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరుగుతోంది.

By:  Sivaji Kontham   |   29 March 2026 12:00 AM IST
ఇండియా న్యూ వేవ్ సినిమా: ఆర్టిఫిషియల్ డ్రామా క్రియేట‌ర్ల‌కు కాలం చెల్లు!
X

భారతీయ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఒక చారిత్రాత్మక పరివర్తన దశలో ఉంది. పాతకాలపు కృత్రిమ డ్రామాలు, రొటీన్ ఫార్ములా కథలకు కాలం చెల్లిపోయిందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా `ఇండియాస్ న్యూ వేవ్ సినిమా` ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజ జీవిత సంఘటనలు, వాస్తవిక పాత్రల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ కూడా బాలీవుడ్‌కు ధీటుగా ఎదుగుతూ రూ. 1000 కోట్ల క్లబ్ సినిమాలతో గ్లోబల్ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. ఈ మార్పు కేవలం వసూళ్లకే పరిమితం కాకుండా.. భారతీయ సినిమా మేకింగ్ స్టైల్‌నే సమూలంగా మార్చేస్తోంది.

ప్రఖ్యాత `జపాన్ టైమ్స్` కథనం ప్రకారం.. భారతీయ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపిస్తోంది. గతంలో కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితమైన మన సినిమాలు, ఇప్పుడు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, మేకింగ్ స్టాండర్డ్స్‌తో ప్రపంచ వేదికపై పోటీ పడుతున్నాయి. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన `దురంధర్ 2` వంటి చిత్రాలు ఈ కొత్త శకానికి నాంది పలికాయని సదరు పత్రిక ప్రశంసించింది. నేటి యువత కేవలం పాటలు, ఫైట్లు మాత్రమే కాకుండా, ఇంటెన్స్ యాక్షన్, బలమైన కథా గమనం ఉన్న చిత్రాలనే కోరుకుంటున్నారని ఈ పరిణామం నిరూపిస్తోంది.

ఈ `న్యూ వేవ్`లో కథాంశాలు కూడా మారుతున్నాయి. భౌగోళిక రాజకీయాలు, దేశభక్తి అంశాలతో కూడిన పొలిటికల్ థ్రిల్లర్లకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరుగుతోంది. జాతీయవాదాన్ని కేవలం నినాదాలకే పరిమితం చేయకుండా భావోద్వేగపూరితంగా కనెక్ట్ చేయడంలో దర్శకులు విజయం సాధిస్తున్నారు. రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోలు సైతం తమ పాత ఇమేజ్‌ను పక్కన పెట్టి.. పాత్ర కోసం శారీరకంగా ఎంతో శ్రమించడం నటీనటుల పరివర్తనకు నిదర్శనం. అలాగే అంతర్జాతీయ స్థాయి సౌండ్ డిజైన్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

డిజిటల్ విప్లవం, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల విస్తృతి కారణంగా భారతీయ సినిమాలకు విదేశాల్లో ఊహించని మార్కెట్ ఏర్పడింది. విదేశీ చిత్రాల నాణ్యతను గమనిస్తున్న భారతీయ ప్రేక్షకులు తమ దేశం నుంచి కూడా అదే స్థాయి ప్రమాణాలను ఆశిస్తున్నారు. దీనివల్ల నిర్మాతలు కూడా భారీ బడ్జెట్‌తో ప్రయోగాత్మక చిత్రాలు తీయడానికి వెనుకాడటం లేదు. ఒకప్పుడు రూ. 100 కోట్లు అనేది పెద్ద రికార్డుగా ఉండేది... కానీ నేడు భారీ చిత్రాలకు రూ.1000 కోట్లు అనేది కనీస బెంచ్‌మార్క్‌గా మారుతోంది.

క‌రోనా క్రైసిస్ ముందు, ఆ త‌ర్వాత ప‌రిస్థితుల్ని స‌మీక్షిస్తే.. దక్షిణాది చిత్రాల ధాటికి కొంత వెనుకబడిన బాలీవుడ్ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటోంది. పాన్-ఇండియా సక్సెస్ అనేది ఒక అనివార్యమైన అంశంగా మార‌డంతో బాలీవుడ్ ఆ దిశగా కొత్త అడుగులు వేస్తోది. ప్రొడక్షన్ వాల్యూస్ మొదలుకొని లొకేషన్ల ఎంపిక వరకు అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తుండటంతో భారతీయ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్‌పై పట్టు సాధిస్తోంది. రానున్న‌ ఐదేళ్లలో భారతీయ సినిమా మార్కెట్ చైనా, అమెరికా మార్కెట్లకు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్లోబ‌ల్ ఆడియెన్‌ని దృష్టిలో ఉంచుకుంటే.. కృత్రిమమైన కథలు రాసే వారికి ఇక స్థానం లేదని.. కేవలం వాస్తవికతకు అద్దం పట్టే `న్యూ వేవ్` సినిమాలదే భవిష్యత్తు అని అర్థమవుతోంది.