Begin typing your search above and press return to search.

భారతదేశంలో మైక్రో-డ్రామా విప్లవం: రిల‌య‌న్స్-రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్ల భారీ పెట్టుబ‌డులు!

ప్రస్తుతం భారతీయ వినోద రంగం ఒక భారీ మార్పుకు లోనవుతోంది. సుదీర్ఘమైన సినిమాలు.. గంటల కొద్దీ సాగే టీవీ సీరియళ్ల స్థానంలో కేవలం రెండు నిమిషాల లోపు ముగిసే `మైక్రో-డ్రామాలు` రాజ్యమేలుతున్నాయి.

By:  Sivaji Kontham   |   4 May 2026 5:00 AM IST
భారతదేశంలో మైక్రో-డ్రామా విప్లవం: రిల‌య‌న్స్-రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్ల భారీ పెట్టుబ‌డులు!
X

ప్రస్తుతం భారతీయ వినోద రంగం ఒక భారీ మార్పుకు లోనవుతోంది. సుదీర్ఘమైన సినిమాలు.. గంటల కొద్దీ సాగే టీవీ సీరియళ్ల స్థానంలో కేవలం రెండు నిమిషాల లోపు ముగిసే `మైక్రో-డ్రామాలు` రాజ్యమేలుతున్నాయి. ఆఫీసు లంచ్ బ్రేక్ అయినా.. ప్రయాణంలో దొరికే చిన్న విరామమైనా.. మొబైల్ ఫోన్ తీసి ఇట్టే చూసేయగలిగే స్నాక‌బుల్ వినోదానికి భారతీయులు బానిసలవుతున్నారు. ఈ ధోరణి ఎంత వేగంగా విస్తరిస్తోందంటే.. ప్రస్తుతం 300 మిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ 2030 నాటికి ఏకంగా 4.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

ఈ మైక్రో-డ్రామాలు ప్రాథమికంగా టీవీ సోప్స్ తరహాలోనే ఉత్కంఠభరితమైన కథాంశాలతో సాగుతాయి. పేదవాడిగా నటించే బిలియనీర్.. పగ తీర్చుకునే ఆత్మలు లేదా అంతస్తుల మధ్య నలిగే ప్రేమకథలు వంటి డ్రామా ఎక్కువగా ఉండే కథలను ఇక్కడ ఎక్కువగా ఎంచుకుంటారు. అయితే వీటి ప్రత్యేకత ఏమిటంటే.. ఒక పూర్తి షోలో సుమారు 50 ఎపిసోడ్‌ల వరకు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ నిడివి కేవలం 90 నుండి 120 సెకన్లు మాత్రమే ఉంటుంది. ఈ పరిమిత కాలంలోనే వీక్షకుడిని ఆకట్టుకోవడానికి ప్రతి ఎపిసోడ్ ముగింపులో ఒక బలమైన `క్లిఫ్ హ్యాంగర్` (తర్వాతి ఎపిసోడ్ ఏమవుతుందో అనే ఉత్కంఠ) ఉంచడం ఈ ఫార్మాట్ లోని ప్రధాన కిటుకు.

భారతదేశంలో ఈ విప్లవానికి ప్రధాన కారణం మన దేశం `మొబైల్-ఫస్ట్`వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వడమే. చాలామంది వీక్షకులు పర్సనల్ కంప్యూటర్లను వాడకుండానే నేరుగా స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. దీనికి తోడు ఒక భారీ బ్లాక్‌బస్టర్ సినిమా తీసే ఖర్చుతో వందల సంఖ్యలో ఇలాంటి మైక్రో-షోలను నిర్మించే అవకాశం ఉండటం నిర్మాతలను ఆకర్షిస్తోంది. 10 లక్షల నుండి 25 లక్షల బడ్జెట్‌తోనే ఒక నాణ్యమైన మైక్రో-డ్రామాను రూపొందించవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకునే వీలుండటంతో పెట్టుబడిదారులు కూడా దీనిపై మక్కువ చూపుతున్నారు.

ఈ సరికొత్త మార్కెట్ లోని లాభాలను గమనించి భారతీయ మీడియా దిగ్గజాలు రంగంలోకి దిగుతున్నాయి. రిలయన్స్ జియో స్టార్ ఇప్పటికే `తడ్కా` పేరుతో తన సొంత ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించి వందల షోలను అందుబాటులో ఉంచింది. వీరికి తోడు జీ ఎంటర్‌టైన్‌మెంట్, బాలాజీ టెలిఫిల్మ్స్ వంటి సంస్థలు కూడా మైక్రో-డ్రామా స్టార్టప్స్‌తో జతకడుతున్నాయి. అంతేకాదు.. బాలీవుడ్ అగ్ర నిర్మాణ‌ సంస్థలైన యష్ రాజ్ ఫిల్మ్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఈ `చిన్న వీడియోల` (షార్ట్స్‌) రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల మైక్రో-డ్రామాలు కేవలం ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమే కాకుండా.. ఒక ప్రధాన వినోద మాధ్యమంగా మారుతున్నాయి.

అయితే ఈ రంగం నిలకడగా ఎదగాలంటే కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా సంస్థలు చైనీస్ లేదా కొరియన్ కథలను రీమేక్ చేస్తూ కంటెంట్ లైబ్రరీని పెంచుకుంటున్నాయి. కానీ కేవలం పరిమాణం మీద దృష్టి పెట్టకుండా.. అసలైన కథలు .. నాణ్యమైన నిర్మాణ విలువలపై దృష్టి సారిస్తేనే వీక్షకులను శాశ్వతంగా ఆకట్టుకోవచ్చు. ఇందుకోసం `కుకు`వంటి ప్లాట్‌ఫామ్స్ ఏకంగా ఏఐ సాయంతో నెలకు వేల సంఖ్యలో కథలను సిద్ధం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. భ‌విష్య‌త్ లో క్వాలిటీ - క్రియేటివిటీ తోడైతే.. ఈ మైక్రో-డ్రామాలు వెండితెర వినోదానికి బలమైన ప్రత్యామ్నాయంగా మారుతాయని చెప్పడంలో సందేహం లేదు.