ఆపరేషన్ సిందూర్... భారత ఓటీటీలకు ఐ&బీ కీలక ఆదేశాలు!
భారత్ – పాక్ మధ్య ఆపరేషన్ సిందూర్ అనంతరం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 May 2025 6:36 PM ISTభారత్ – పాక్ మధ్య ఆపరేషన్ సిందూర్ అనంతరం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పై సుమారు 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై పాక్ క్షిపణులతో దాడికి ప్రయత్నించింది.. అయితే ఆ ప్రయత్నాన్ని భారత్ బలంగా తిప్పికొట్టింది. మరోపక్క పాక్ లోని లాహోర్ సహా 7 ప్రాంతాల్లోని గగనతల వ్యవస్థలను ధ్వంసం చేసింది.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా తాము కేవలం ఉగ్రవాదుల శిబిరాలపైనే దాడి చేశామని.. పాక్ సైనిక స్థావరాలపై దాడి చేయలేదని.. ఈ విషయాన్ని గ్రహించకుండా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే రియాక్ట్ అవ్వక తప్పదని భారత్ హెచ్చరించింది. దానికి తగ్గట్లుగానే పని చేసుకుపోతుంది. ఈ సమయంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.
అవును... భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జాతీయ భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా... జాతీయ భద్రత దృష్ట్యా.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న నేపథ్యంలో.. పాక్ నుంచి వచ్చే అన్ని కంటెంట్ లను నిలిపివేయాలని, ఇప్పటికే ఉన్నవాటిని తొలగించాలని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్, స్ట్రీమర్ లను ఆదేశించింది.
ఈ సందర్భంగా... పాకిస్థాన్ కు చెందిన అన్ని సినిమాలు, పాటలు, వెబ్ సిరీస్ లు, పాడ్ కాస్ట్ లను తక్షణమే తొలగించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి.. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు బలిగొన్న సంగతి తెలిసిందే. దాడి తర్వాత భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించాయి.
ఈ ఆపరేషన్.. పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయగా.. ఆ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మట్టికరిచారు! ఈ సందర్భంగా ఉగ్రవాదం విషయంలో జీరో టోలరెన్సీ అనే స్పష్టమైన సందేశాన్ని భారత్ బలంగా పంపింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ నుంచి వచ్చే అన్ని కంటెంట్ లపై పూర్తి నిషేధాన్ని అమలు చేసింది.
ఇదే సమయంలో... భారత సర్వభౌమాధికారం, సమగ్రతను ప్రభావితం చేసే.. దేశ భద్రతకు ముప్పు కలిగించే.. లేదా విదేశాలతో భారత్ సంబంధానికి హాని కలిగించే ఏదైనా కంటెంట్ ను ప్రదర్శించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు, ప్రచురించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ మేరకు మంత్రిత్వ శాఖ స్ట్రీమర్ లకు సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది.