థియేటర్లకు పండగొచ్చిందహో..
అప్పుడప్పుడూ ఓ సినిమా కాస్త సందడి తీసుకురావడం.. అంతలోనే మళ్లీ థియేటర్లు ఖాళీ అయిపోవడం.. ఇదీ వరస.
By: Garuda Media | 14 Aug 2025 1:00 PM ISTకొత్త సినిమాలు రిలీజైనా ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోవడం.. వచ్చే డబ్బులు థియేటర్ల మెయింటైనెన్స్‌కు కూడా సరిపోకపోవడం.. షోలు వేస్తే చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడం.. ఇలా వెండి తెరల పరిస్థితి రోజు రోజుకూ దుర్భరంగా మారుతోంది. తరచూ పెద్ద సినిమాలు రాక థియేటర్లను మెయింటైన్ చేయడమే పెద్ద టాస్కుగా మారిపోతోంది.
అప్పుడప్పుడూ ఓ సినిమా కాస్త సందడి తీసుకురావడం.. అంతలోనే మళ్లీ థియేటర్లు ఖాళీ అయిపోవడం.. ఇదీ వరస. ఇలాంటి టైంలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ దేశవ్యాప్తంగా థియేటర్లలో పండుగ వాతావరణం తీసుకొస్తోంది. ఈ ఏడాది ఈ స్థాయిలో ఒకేసారి ఇండియా మొత్తం సందడి నెలకొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇటు సౌత్ సినిమా అయిన 'కూలీ'.. అటు బాలీవుడ్ మూవీ అయిన ‘వార్-2’.. రెండూ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాయి.
హృతిక్‌కు ఉత్తరాదిన ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. పైగా ‘వార్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ చేశాడు. హృతిక్‌కు దక్షిణాదిన కూడా ఫాలోయింగ్ లేకపోలేదు. అతడికి ఎన్టీఆర్ తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ‘వార్-2’ దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజవుతోంది. ఇక ‘కూలీ’ సినిమాకు గత కొన్ని వారాల్లో క్రేజ్ మల్టిప్లై అవుతూ వచ్చింది. సౌత్ జనాలు సినిమా కోసం ఊగిపోతున్నారు. రిలీజ్ టైంకి నార్త్ ఇండియాలో సైతం ఈ చిత్రానికి క్రేజ్ పెరిగిపోయింది.
ఇలా రెండు చిత్రాలూ మాంచి హైప్ మధ్య రిలీజవుతున్నాయి. రెంటికీ కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరిగాయి. రిలీజ్ రోజైన గురువారం దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం చూడబోతున్నాం. శుక్రవారం ఎలాగూ ఇండిపెండెన్స్ డే. థియేటర్లు కోలాహలంగా ఉంటాయి. శని, ఆదివారాలూ వెండితెరలు కళకళలాడే అవకాశమే ఉంది. రెండు చిత్రాలకూ పాజిటివ్ టాక్ వస్తే.. ఈ ఏడాది లోటును చాలా వరకు భర్తీ చేసే స్థాయిలో ఇండియన్ బాక్సాఫీస్ షేకైపోవడం ఖాయం.
