Begin typing your search above and press return to search.

రెస్టారెంట్లపై IT శాఖ కఠిన నిఘా..63వేలకు పైగా!

మనం రెస్టారెంట్‌లో భోజనం చేసి బిల్లు కట్టిన తర్వాత, ఆ రికార్డులు మాయమైతే? సరిగ్గా ఇదే జరిగింది.

By:  Madhu Reddy   |   10 March 2026 11:52 AM IST
రెస్టారెంట్లపై IT శాఖ కఠిన నిఘా..63వేలకు పైగా!
X

మీరు హోటల్‌లో బిల్‌ కట్టేటప్పుడు ఆ డబ్బులు ప్రభుత్వానికి ట్యాక్స్‌ రూపంలో చేరుతున్నాయని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు భారీగా పన్ను ఎగవేస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఏకంగా 63,000 రెస్టారెంట్లపై నిఘా పెట్టి, కోట్ల రూపాయల గోల్‌మాల్‌ను బయటపెట్టింది. టెక్నాలజీ సాయంతో దొంగ బిల్లుల గుట్టు రట్టు చేసిన ఆదాయపు పన్ను శాఖ, ఇప్పుడు ఆ హోటల్ యజమానులకు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆ వివరాలేంటో చూద్దాం.

డిజిటల్ మాయాజాలం.. కోట్ల రూపాయల గోల్‌మాల్:

మనం రెస్టారెంట్‌లో భోజనం చేసి బిల్లు కట్టిన తర్వాత, ఆ రికార్డులు మాయమైతే? సరిగ్గా ఇదే జరిగింది. ఐటీ శాఖ జరిపిన ప్రాథమిక తనిఖీల్లో దాదాపు రూ .408 కోట్ల రూపాయల అమ్మకాలను హోటల్ యాజమాన్యాలు దాచిపెట్టినట్లు తేలింది. ఇందుకోసం వారు అత్యాధునిక సాఫ్ట్‌వేర్లను వాడుతూ బిల్లులను డిలీట్ చేయడం, అమ్మకాల లెక్కలను మార్చడం వంటి తిమ్మినిబమ్మిని చేసే పనులు చేశారు. ఇక కేవలం 62 రెస్టారెంట్లలో సర్వే చేస్తేనే ఇన్ని అక్రమాలు బయటపడటంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1.77 లక్షల రెస్టారెంట్ల డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో విశ్లేషించగా, ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

తప్పు సరిదిద్దుకునే ఛాన్స్:

అక్రమాలు జరిగాయని తెలిసిన వెంటనే జరిమానాలు వేయకుండా, ఐటీ శాఖ ఒక వినూత్నమైన అడుగు వేసింది. అదే 'సాక్షమ్ నడ్జ్' కార్యక్రమం. దీని ద్వారా అనుమానిత జాబితాలో ఉన్న 63,000 రెస్టారెంట్లకు ఒక అవకాశం ఇస్తున్నారు. "మీరు చేసిన తప్పును మీరే ఒప్పుకోండి.. వాస్తవ ఆదాయాన్ని వెల్లడించి పన్ను చెల్లించండి" అని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ ప్రక్రియను మార్చి 31, 2026 లోపు పూర్తి చేయాలని గడువు విధించారు. ఇది ఒక రకంగా హోటల్ యజమానులకు ఇచ్చిన 'వార్నింగ్ బెల్' వంటిది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లెక్కలు సరి చూసుకోకపోతే, ఆ తర్వాత కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పారదర్శకత వైపు అడుగులు.. వినియోగదారుల బాధ్యత:

ఈ స్థాయిలో ఐటీ శాఖ నిఘా పెట్టడం అనేది కేవలం పన్ను వసూలు కోసమే కాదు, వ్యాపార రంగంలో పారదర్శకత తీసుకురావడానికి కూడా. హోటల్ రంగంలో జరుగుతున్న ఈ డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం సక్రమంగా చేరుతుంది. ఇక ఇలాంటి తనిఖీల వల్ల భవిష్యత్తులో రెస్టారెంట్లు తమ బిల్లింగ్ విధానాలను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. మనము కూడా హోటల్‌లో తిన్నప్పుడు పక్కాగా జీఎస్టీ బిల్లు అడగడం ద్వారా ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. మార్చి 31 లోపు ఎన్ని రెస్టారెంట్లు నిజాయితీగా తమ ఆదాయాన్ని ప్రకటిస్తాయో వేచి చూడాలి.