రణబీర్‌లోకి రాముడి గుణగణాలు ప్రవేశిస్తే మంచిదేగా.. దర్శకుడి పంచ్!
రణబీర్ కపూర్‌తో రాక్‌స్టార్, తమాషా వంటి క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ పరిచయం అవసరం లేదు.
By: Sivaji Kontham | 1 Jun 2026 5:00 PM ISTరణబీర్ కపూర్‌తో రాక్‌స్టార్, తమాషా వంటి క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ పరిచయం అవసరం లేదు. ఇప్పుడు అతడు రణబీర్ పై చేసిన ఓ కామెంట్ ఇంటర్నెట్‌లో హాట్ టాపిగ్గా మారింది. పురాణేతిహాసం అయిన `రామాయణం`లో రణబీర్ శ్రీరాముడి పాత్ర పోషించడంపై ఇంతియాజ్ తన ఉత్సాహాన్ని దాచుకోలేదు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రణబీర్ కపూర్‌కు ఉన్న అద్భుతమైన నటన పరిధిని కొనియాడారు. రాముడి పాత్రను పోషించడం వల్ల రణబీర్‌కు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో మేలు జరుగుతుందని,.. ఈ పాత్ర అతనిపై జీవితాంతం ఒక బలమైన ముద్ర వేస్తుందని అభిప్రాయపడ్డారు.
రణబీర్ ఒక నటుడిగా ఎలాంటి పాత్రనైనా చేయగలడు. అతను విభిన్నమైన పాత్రలను ఎంచుకోవాలి. అలా చేసినప్పుడు అతడు ఆ పాత్రల్లోనే లీనమైపోతాడు. రణబీర్ ఒక ప్యూర్ యాక్టర్. అతను శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఎందుకంటే ఆ పాత్రకు ఒక ప్రత్యేకమైన రియాలిటీని - ఎఫెక్ట్‌ను అతడు తీసుకురాగలడని అన్నారు.
అంతేకాదు రణబీర్ సాధారణంగా తను చేసే పాత్రల స్వభావాన్ని డీప్‌గా అంతఃకరణశుద్దితో గ్రహించి.. తన సొంతం చేసుకునే నటుడని తెలిపారు. శ్రీరాముడి గుణగణాల నుండి రణబీర్ ఎంతో నేర్చుకుంటాడని.. అది అతడి వ్యక్తిత్వాన్ని మరింత సుసంపన్నం చేస్తుందని దర్శకుడు ఇంతియాజ్ అలీ విశ్లేషించారు. ఆసక్తికరంగా ఇంతియాజ్ గతంలో రణబీర్ తో రాక్‌స్టార్- తమాషా లాంటి సినిమాలు చేసేప్పటికి లవర్ బోయ్‌గా కథానాయికలతో రొమాన్స్ చేసేవాడనే పుకార్లు ఎక్కువగా ఉండేవి. అప్పట్లోనే దీపిక, కత్రినతో కూడా అతడు ప్రేమాయణాలు నడిపించాడు. గాళ్స్ తో అతడి జోష్ గురించి బాగా తెలిసినవాడు ఇంతియాజ్. అందుకే ఇప్పుడు రణబీర్ పై అలా పంచ్ వేసాడని గ్రహించవచ్చు. లవర్ బోయ్ చాక్లెట్ బోయ్ లాంటి రణబీర్ లోకి శ్రీరాముడి గుణగణాలు ప్రవేశిస్తే మంచిదేగా అనేది అతడి అభిప్రాయం కావొచ్చు!
అదంతా అటుంచితే.. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌లో రణబీర్ లుక్‌పై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు అతడి రూపాన్ని మెచ్చుకోగా.. మరికొందరు ఈ పాత్రకు అతడు సరిపోలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే... నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న `రామాయణ` చిత్రంలో రణబీర్ కపూర్ కేవలం శ్రీరాముడి పాత్రలోనే కాకుండా పరశురాముడి పాత్రలోనూ కనిపించబోతున్నాడు. విదేశీ యాత్రలో రణబీర్ స్వయంగా ఈ విషయాన్ని రివీల్ చేసిన విషయం తెలిసిందే.
యష్ - నమిత్ మల్హోత్రా నిర్మాతలుగా నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రామాయణ` భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యష్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా.. రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుండగా.. మొదటి భాగం దీపావళి 2026న, రెండవ భాగం దీపావళి 2027న థియేటర్లలోకి రానున్నాయి. ఇక దర్శకుడు ఇంతియాజ్ అలీ విషయానికి వస్తే..తన రొమాంటిక్ డ్రామా `మై వాపస్ ఆవుంగా` జూన్ 12న విడుదల కానుండగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. దిల్జిత్ దోసాంజ్, వేదాంగ్ రైనా, శర్వరి, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. కంగన, మనోజ్ భాజ్ పాయ్ నటించిన సినిమాలతో రిలీజ్ పోరులో పోటీపడనుంది.
