దేశవిభజన వలసల నేపథ్యంలో ప్రేమకథతో పాపులర్ దర్శకుడి ప్రయోగం!
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ వెండితెరపై ప్రేమకథలను ఆవిష్కరించే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది.
By: Sivaji Kontham | 16 March 2026 5:00 PM ISTప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ వెండితెరపై ప్రేమకథలను ఆవిష్కరించే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. జబ్ వి మెట్, రాక్ స్టార్, తమాషా వంటి చిత్రాలతో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా మ్యూజికల్ లవ్ స్టోరీల సృష్టికర్తగా ఇంతియాజ్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రెహమాన్- ఇర్షాద్ జోడీతో అతడి మ్యాజిక్ అంతా ఇంతా కాదు. కేవలం ప్రేమను మాత్రమే కాకుండా మనిషి అంతరంగ మథనాన్ని.. భావోద్వేగాల లోతును ఆయన స్పృశిస్తారు. అందుకే ఇంతియాజ్ సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకులకు తమ సొంత కథలా అనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ సులువుగా ఆయన కథలకు కనెక్టవుతారు.
తాజా సమాచారం ప్రకారం.. ఇంతియాజ్ అలీ తన తదుపరి ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఆయన భారత్-పాకిస్థాన్ దేశ విభజన అనంతర కాలంలో వలసల నేపథ్యంలో సాగే ఒక అద్భుతమైన ప్రేమకథను ఎంచుకున్నారు. దేశ విభజన అనేది ఒక చారిత్రక ఘట్టమే కాకుండా లక్షలాది కుటుంబాల మధ్య మిగిలిపోయిన ఒక తీరని వేదన. అలాంటి భావోద్వేగభరితమైన అంశాన్ని ఇంతియాజ్ తనదైన ప్రేమ కోణంలో ఎలా చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక టైటిల్ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి `మై వాపస్ ఆవుంగా` అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ వింటుంటేనే విభజన వల్ల విడిపోయిన మనసులను కలిపే ఒక ప్రయాణంలా కనిపిస్తోంది. తన గత చిత్రాలలో ఉండే ప్రేమలోని గాఢత .. హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ ఈ సినిమాలో కూడా పుష్కలంగా ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దిల్జీత్ దోసాంజ్, శార్వరి వాఘ్, వేదాత్ రైనా తదితరులు నటిస్తున్నారు. జూన్ 2026లో దీనిని రిలీజ్ చేయాలనేది ప్లాన్.
ఈ కథ కోసం ఇంతియాజ్ అలీ సుదీర్ఘ కాలం పరిశోధన చేసినట్లు తెలుస్తోంది. కేవలం చరిత్రను చదవడం మాత్రమే కాకుండా.. దేశ విభజన సమయంలో ప్రత్యక్షంగా బాధపడిన వ్యక్తుల నిజ జీవిత కథల నుంచి ఆయన ప్రేరణ పొందారు. తన చుట్టూ ఉన్న వారు చెప్పిన అనుభవాలు.. షేర్ చేసిన జ్ఞాపకాల ఆధారంగా ఈ కథను ఎంతో సహజంగా.. హృదయానికి హత్తుకునేలా ఇంతియాజ్ సిద్ధం చేసి చిత్రీకరణకు వెళ్లారని జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి.
సాధారణంగా దేశ విభజన సినిమాలంటే రక్తపాతం, హింస ఎక్కువగా కనిపిస్తాయి. రాజకీయాలు, కుట్రలు కనిపిస్తాయి. కానీ ఇంతియాజ్ అలీ మార్కు సినిమాలో యుద్ధం కంటే మనుషుల మధ్య ఉండే అనురాగం, విభజన రేఖలు విడదీయలేని ఆత్మీయత ప్రధానంగా కనిపిస్తాయి. ఇక ప్రేమకథా చిత్రాల్లో బెంచ్ మార్క్ సెట్ చేసి, వసూళ్ల పరంగా రికార్డుల్ని తిరగరాసిన `సయ్యారా` వంటి సినిమాతో పోలిస్తే.., ఈ విభజన కాలం నాటి ప్రేమకథ మరింత పరిణతితో కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇంతియాజ్ అలీ సినిమాల్లో హీరో హీరోయిన్ల పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి, ఈ పీరియడ్ డ్రామా కోసం ఆయన ఎవరిని ఎంపిక చేస్తారన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కచ్చితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా.. ఇంతియాజ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.
తెలుగులోను రావాలి:
ఇటీవలి కాలంలో పాన్ ఇండియా మార్కెట్ ని అందుకోవడంలో సరిహద్దులు చెరిగిపోయాయి. సినిమాలకు భాషా భేధం లేదు. హిందీ చిత్రాలు కూడా పాన్ ఇండియాలో మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. బాలీవుడ్ సినిమా నెమ్మదిగా దక్షిణాదిన కూడా పాగా వేసేందుకు అవసరమైన కృషి జరుగుతోంది. ఈ నేపథ్యంలో `సయ్యారా` (అనువదించి రిలీజ్ చేయలేదు) తరహా మిస్టేక్ చేయకుండా, నేరుగా ఇంతియాజ్ తన చిత్రాన్ని తెలుగు, తమిళం సహా పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించి భారీగా రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
