Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ సినీ ప్రియుల ఐమ్యాక్స్‌ క‌ళ క‌ష్ట‌మేనా?

హైద‌రాబాద్ సినీ ల‌వ‌ర్స్‌కు ఐమ్యాక్స్‌ ఓ తీర‌ని క‌ల‌గా మారిపోయింది. ఎప్పుడెప్పుడు మ‌న సిటీలో ఐమ్యాక్స్ థియేట‌ర్ ఓపెన్ అవుతుందా? దాని ఎక్స్‌పీరియ‌న్స్‌ని ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేస్తామా? అని సినీ ప్రియులు ఆస‌క్తిగా, ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Jun 2025 2:57 PM IST
హైద‌రాబాద్ సినీ ప్రియుల ఐమ్యాక్స్‌ క‌ళ క‌ష్ట‌మేనా?
X

హైద‌రాబాద్ సినీ ల‌వ‌ర్స్‌కు ఐమ్యాక్స్‌ ఓ తీర‌ని క‌ల‌గా మారిపోయింది. ఎప్పుడెప్పుడు మ‌న సిటీలో ఐమ్యాక్స్ థియేట‌ర్ ఓపెన్ అవుతుందా? దాని ఎక్స్‌పీరియ‌న్స్‌ని ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేస్తామా? అని సినీ ప్రియులు ఆస‌క్తిగా, ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవ‌ల ఐమాక్స్ ప్రియుల్ని ఆనంద‌ప‌రిచే వార్త‌ని వెల్ల‌డించారు ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్‌. త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో ఐమ్యాక్స్ థియేట‌ర్ ప్రారంభం కానుంద‌ని, షామీర్ పేట్ ప‌రిస‌రాల్లో థియేట‌ర్ ఏర్పాటుకు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌ని ప్ర‌క‌టించారు.

దీంతో ఐమ్యాక్స్ థియేట‌ర్ కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్న సినీ ల‌వ‌ర్స్ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఎంత కాలంగా ఎదురు చూస్తున్న ఐమాక్స్ క‌ల నెర‌వేర‌బోతోంద‌ని సంబ‌రాప‌డ్డారు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిల‌వ‌లేదు. హైద‌రాబాద్ సినీ ప్రియుల ఐమ్యాక్స్ క‌ల ఇప్ప‌ట్లో నెర‌వేరే అవ‌కాశం లేద‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. దీంతో సినీ ప్రియులు విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

ఐమ్యాక్స్ కార్పొరేష‌న్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రీత‌మ్ డేనియ‌ల్ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఐమ్యాక్స్ కోసం ఎదురు చూస్తున్న హైద‌రాబాద్ సినీ ప్రియుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. `రీసెంట్‌గా ఐమ్యాక్స్‌పై కొన్ని వార్త‌లు విన్నాను. ఏషియ‌న్ సినిమాస్‌తో క‌లిసి ఐమ్యాక్స్ ఇండియా వ‌ర్గాలు హైద‌రాబాద్‌లో ఐమ్యాక్స్ థియేట‌ర్‌ని ఏర్పాటు చేయ‌బోతున్నాయ‌ది పూర్తిగా అబ‌ద్ధం. హైద‌రాబాద్‌కు ఐమ్యాక్స్‌ని తీసుకురావ‌డానికి ప‌లువురు ఎగ్జిబిట‌ర్ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒప్పందం ఫైన‌ల్ కాలేదు`అన్నారు.

ఐమ్యాక్స్‌ని హైద‌రాబాద్‌కు తీసుకురావాల‌నే ఆస‌క్తి ఉంది. దీనికి సంబంధించిన ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూనే ఉంటాయి. ఏ ఒక్క అవ‌కాశాన్ని కూడా వ‌ద‌ల‌కుండా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటాం` అని పేర్కొన్నారు. ఐమ్యాక్స్ కార్పొరేష‌న్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రీత‌మ్ డేనియ‌ల్ తాజా ప్ర‌క‌ట‌న‌తో సినీ ప్రియుల ఆనందం ఆవిరైపోయింది. రానున్న రోజుల్లో అయినా ఐమ్యాక్స్ థియేట‌ర్‌ని హైద‌రాబాద్‌కు తీసుకొస్తార‌నే ఆశాభావాన్ని వారు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి హైద‌రాబాద్‌కు ఐమ్యాక్స్ క‌ల ఎప్ప‌టికి తీరేనో.