నా పిల్లలు ప్రేమను `సంపాదించుకోవాలి` అనుకోకూడదు: ఇలియానా
ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి? అనే అంశంపై ఇలియానా మాట్లాడింది.
By: Tupaki Desk | 9 May 2025 9:55 AM ISTటాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఇలియానా బాలీవుడ్ డ్రీమ్స్ తో ముంబైకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ ఆశించిన స్థాయికి చేరుకోవడంలో విఫలమైంది. దానికి కారణాలు ఏవైనా కానీ, గోవా బ్యూటీ ఇటీవల సినిమాలను తగ్గించుకుని, పూర్తిగా వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించింది. ఇలియానా ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో గర్భధారణకు సంబంధించి అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని తెలిపింది.
ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి? అనే అంశంపై ఇలియానా మాట్లాడింది. సోషల్ మీడియాలో ఒక అభిమాని ఇలియానాను ఇలా ప్రశ్నించారు. పిల్లలు దయలేని క్రూరుల్లా దుష్టుల్లా స్వార్థపూరితంగా పెరగకూడదంటే తల్లిగా ఏం చేయాలి? నిజమైన ప్రేమ అంటే ఏమిటి? అని అడిగారు. ఈ ప్రశ్నకు స్పందించిన ఇలియానా.. పిల్లల్ని ప్రేమ ``సంపాదించుకోవాలి`` అనే విధంగా పెంచను! అని సమాధానమిచ్చింది. నేను అనుభవించిన అత్యంత చెత్త అనుభూతి అది! అని కూడా ఇలియానా వ్యాఖ్యానించింది. ప్రేమ స్వతహాగా ఉండాలి. అది సంపాదించుకుంటే వచ్చేది కాదు! గౌరవం ఆనందంలా ప్రేమ కూడా సహజంగా వచ్చేది! అని ఇలియానా వివరించింది.
నా పిల్లలు నా ప్రేమను ``సంపాదించుకోవాలి`` అని ఎప్పుడూ భావించకూడదని కోరుకుంటున్నాను. అది నేను అనుభవించిన అత్యంత చెత్త అనుభూతి. `ప్రేమ సరిపోలేదు` అనే భావన అస్సలు వారికి రాకూడదు. నేను సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే దయగల పిల్లలను పెంచాలనుకుంటున్నాను. అందరు తల్లిదండ్రులు అలానే భావిస్తారని నేను అనుకుంటున్నాను. పిల్లలు ఎంతగా ప్రేమించబడుతున్నారో తెలుసుకోవడానికి నేను నా వంతు కృషి చేస్తాను.. అని ఇలియానా అంది. సహజసిద్ధమైన తల్లి ప్రేమ, ఎమోషన్స్ ని తాను ఇష్టపడతానని ఇలియానా చెప్పకనే చెప్పింది. అయితే ప్రేమను ``సంపాదించుకోవాలి`` అనేది చెత్త అనుభవం అని ఇలియానా వ్యాఖ్యానించడానికి కారణాలను అభిమానులు ఊహిస్తున్నారు. ఇలియానా స్పందన చూశాక.. ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ ప్రేమ పేరుతో మోసం చేసిన విషయాన్ని ఇలియానా ఇంకా మర్చిపోలేదని కొందరు అభిమానులు గుర్తు చేస్తున్నారు.
ఇలియానా 2021లో విదేశీ ప్రియుడు మైఖేల్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. కానీ ఈ జంట ప్రేమాయణాన్ని చాలా కాలం రహస్యంగా దాచి ఉంచింది. వీరికి కోవా ఫోనిక్స్ డోలన్ అనే కుమారుడు ఉన్నాడు. ఇటీవల రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ప్రకటించిన ఇలియానా పూర్తిగా వ్యక్తిగత జీవితంపైనే దృష్టి సారించింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇలియానా చివరిసారిగా శిర్షా గుహ ఠాకుర్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ `దో ఔర్ దో ప్యార్`లో కనిపించింది. ఈ చిత్రంలో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ తదితరులు నటించారు.
