శష్టిపూర్తి సినిమాకు ఇళయరాజా లవ్లీ ఎలివేషన్స్
ఒక సినిమాకు సంగీతం ప్రాణం అయితే, ఆ ప్రాణానికి శరీరంగా నిలిచిన చిత్రం శష్టిపూర్తి. మే 30న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో అనూహ్య స్పందన లభిస్తోంది.
By: Tupaki Desk | 3 Jun 2025 8:45 PM ISTఒక సినిమాకు సంగీతం ప్రాణం అయితే, ఆ ప్రాణానికి శరీరంగా నిలిచిన చిత్రం శష్టిపూర్తి. మే 30న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో అనూహ్య స్పందన లభిస్తోంది. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతమందించిన ఈ చిత్రం ఇప్పుడు తన బలమైన ఎమోషన్‌తో పాటు క్లాస్ మ్యూజిక్‌కు దక్కిన గొప్ప గుర్తింపు కలిగిన సినిమాగా నిలుస్తోంది.
ఇళయరాజా జన్మదినం సందర్భంగా శష్టిపూర్తి చిత్ర బృందం చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపింది. నటుడు రాజేంద్రప్రసాద్, హీరో రూపేష్, దర్శకుడు పవన్ ప్రభ తదితరులు మాస్ట్రో రాజాను కలిశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ తన కెరీర్ లో బెస్ట్ హిట్స్ అయిన 'ఏప్రిల్ 1 విడుదల', 'ప్రేమించు పెళ్లాడు' చిత్రాల నుండి కొన్ని పాటలు ఆలపించారు. దాంతో మాస్ట్రో ఇళయరాజా ఆశ్చర్యపోయారు. ‘‘మీరు అద్భుతంగా పాడుతున్నారు, ప్రసాద్’’ అంటూ ఆయన అభినందించారు.
ఈ సందడిలో జరిగిన ముచ్చటల్లో ఆయన ఎంతో సమయాన్ని కేటాయించి, దర్శకుడు పవన్ ప్రభ, హీరో రూపేష్, సినిమాటోగ్రాఫర్ రామ్, గేయ రచయిత చైతన్య ప్రసాద్‌లతో సినిమా గురించి మాట్లాడారు. సినిమా కంటే ముందుగా కథను ప్రాణంగా భావించి అందరూ కలిసి పని చేశారంటూ, ఈ ప్రయత్నాన్ని ఇళయరాజా గారు హృదయపూర్వకంగా ప్రశంసించారు.
ఈ సందర్భంగా హీరో మరియు నిర్మాతగా వ్యవహరించిన రూపేష్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకి ఇంత ఆదరణ రావడానికి ప్రధాన కారణం ఇళయరాజా సార్. ఆయన మ్యూజిక్‌తో మా సినిమాకు మంచి క్రేజ్ లభించింది. ఆయనే మా చిత్రానికి మొదటి హీరో. ఈ సినిమా ద్వారా నేనూ నా టీమ్ కూడా ఎంతో నేర్చుకున్నాం. ఇలాంటివే మరెన్నో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తాను” అన్నారు.
ఇక ఈ చిత్రంలో నటించిన రాజేంద్రప్రసాద్, అర్చనా, ఆకాంక్ష వంటి అనుభవజ్ఞుల నటన సినిమాకు ఓ బలమైన పునాది వేసింది. దర్శకుడు పవన్ ప్రభ తీసుకున్న వినూత్న దృక్కోణం ఈ కుటుంబ కథా చిత్రాన్ని మరింత భావోద్వేగపూరితంగా మార్చింది. ముఖ్యంగా తరం తరం మధ్య ఉన్న ఎమోషన్స్ ను చిత్రంలో చూపిన సరళమైన కాన్వాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది. ఇలయరాజా అభిమానులకే కాదు, మంచి భావోద్వేగాల సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులకు శష్టిపూర్తి ఓ మంచి సినిమాగా నిలుస్తోంది.
