Begin typing your search above and press return to search.

ఇళయరాజా పాటలపై మళ్లీ వివాదం.. మైత్రీకి నోటీసులు?

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల్లో ఇళయరాజా కంపోజ్ చేసిన పాత తమిళ పాటలు వినిపించాయి.

By:  Tupaki Desk   |   15 April 2025 4:37 PM IST
ఇళయరాజా పాటలపై మళ్లీ వివాదం.. మైత్రీకి నోటీసులు?
X

సంగీత ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఇళయరాజా.. ఇప్పుడు మరోసారి ఉహించని షాక్ ఇచ్చారు. ఈసారి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలోని పాటలపై ఆయన సీరియస్ అయ్యారు. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. అయితే ఈ విజయానికి మరింత బూస్ట్ ఇచ్చిన సీన్స్‌లో వినిపించిన పాటలే ఇప్పుడు సమస్యగా మారాయి.

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల్లో ఇళయరాజా కంపోజ్ చేసిన పాత తమిళ పాటలు వినిపించాయి. ఫ్యాన్స్ థియేటర్‌లో ఈ పాటలపై పాజిటివ్ గా స్పందించడంతో ఆ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వీటిని అనుమతి లేకుండా వాడినట్లు భావించిన ఇళయరాజా, మైత్రీ మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపించారు.

నిర్మాణ సంస్థ ఐదు కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేయడంతో పాటు, సంబంధిత మూడు పాటలను తక్షణం తొలగించాలని, మరోవైపు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సూచించారు. ఇళయరాజా ఇలాంటి నోటీసులు పంపడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా పలు ఈవెంట్లలో తన పాటలు అనుమతి లేకుండా పాడిన గాయకులపై చర్యలు తీసుకున్నారు.

ముఖ్యంగా సునిత, ఎస్పీబీ వంటి దిగ్గజ గాయకులు కూడా ఈ వివాదాల్లో చిక్కుకోవాల్సి వచ్చింది. లెజెండరీ కంఫోజర్ అయినప్పటికీ, ఆయన్ను ఇలా తరచూ నోటీసుల ద్వారా వార్తల్లో చూడడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమా మేకర్స్, పాటలను వాడే ముందు కాపీరైట్ క్లియరెన్స్ తీసుకోవాలి. అయితే ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్లక్ష్యం వహించారా లేక వాడిన పాటలు నిజంగా ఒరిజినల్ కామ్యూనికేషన్ ద్వారా లభించాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇళయరాజా డిమాండ్ చేసిన ఐదు కోట్ల నష్టపరిహారంపై స్పందించకుంటే.. అది కోర్టు వరకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో మైత్రీ వంటి పెద్ద బ్యానర్ ఎలాంటి బాధ్యతతో వ్యవహరిస్తుందన్నది కీలకం. ఇప్పటికే వారు తమిళ మార్కెట్‌లోకి అడుగుపెడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో ఇలా వివాదంలో చిక్కుకోవడం పెద్ద సమస్య అవుతుంది. అజిత్ సినిమాకు వచ్చిన పాజిటివ్ బజ్‌లో ఇది కొంతకాలం డామేజ్ చేస్తుందనే అనుమానాలు లేకపోలేదు.

ఇళయరాజా గతంలోనూ తమిళ్ సినిమా పరిశ్రమపై తన పాటల హక్కుల విషయంలో గట్టిగానే నడిచారు. ఆయన భావన, కాపీరైట్ రూల్స్‌కి వ్యతిరేకం కాదు కానీ, కలబోసుకొని పరిష్కరించగలిగిన అంశాలను నోటీసుల రూపంలో పబ్లిక్‌గా తీసుకురావడం బలమైన డిబేట్‌కు దారితీస్తోంది. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.