Begin typing your search above and press return to search.

షారూఖ్ వార‌సుడి కంటే సైఫ్ వార‌సుడికే స్పీడెక్కువ‌!

ఇంత‌లోనే తన రెండవ సినిమాను ఖ‌రారు చేసాడ‌ని తెలిసింది. ఈసారి దినేష్ విజన్ మాడాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో రొమాంటిక్ డ్రామాలో న‌టించ‌నున్నాడు.

By:  Tupaki Desk   |   6 Sep 2023 1:30 AM GMT
షారూఖ్ వార‌సుడి కంటే సైఫ్ వార‌సుడికే స్పీడెక్కువ‌!
X

సువిశాల‌మైన సినీవినీలాకాశంలో న‌ట‌వార‌సుల వెల్లువ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. నిజం చెప్పాలంటే ఈరోజుల్లో ప్ర‌తి ఒక్క‌రూ ఆర్టిస్టే. హీరో కుమారుడు, హీరోయిన్ కుమారుడు, నిర్మాత లేదా ద‌ర్శ‌కుడి కుమారుడు, లేదా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్.. విలన్ ల కుమారుడు ఎవ‌రైనా హీరోనే. అందుకే ఇటీవ‌లి కాలంలో హీరోల‌కు కొద‌వేమీ లేదు. వాళ్ల‌కు సూట‌య్యే క‌థలే క‌రువ‌య్యాయి.

ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్ - అమృతా సింగ్ ల కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ సైలెంటుగా న‌టన‌లోకి దూసుకొస్తున్నాడు. అత‌డు ఇప్ప‌టికే క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో డెబ్యూ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇంత‌లోనే తన రెండవ సినిమాను ఖ‌రారు చేసాడ‌ని తెలిసింది. ఈసారి దినేష్ విజన్ మాడాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో రొమాంటిక్ డ్రామాలో న‌టించ‌నున్నాడు. తాత్కాలికంగా 'దిలేర్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహించనున్నారు. ఇబ్రహీం అలీఖాన్ 'దిలేర్' స్క్రిప్ట్ విని ఆకర్షితుడయ్యాడని, ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి ఉత్సాహంగా ఆమోదం తెలిపాడని కూడా తెలుస్తోంది.

చ‌క్క‌గా కుదిరిన ప్రేమ‌కథా చిత్రమిద‌ని .. ఈ చిత్రం శృంగారం సంగీతం మేళవింపుతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. ఇబ్రహీంతో చర్చలు ఒక దశకు చేరుకున్నప్పటికీ క‌థానాయిక‌ను ఖరారు చేయాల్సి ఉంది. ఇబ్రహీం అలీ ఖాన్ స్క్రిప్ట్‌ని ఇష్టపడ్డాడు. వెంటనే అతని అనుమతిని ఇచ్చాడు. ఇది చాలా సమతుల్యంగా బాగా రాసిన ప్రేమకథ.. ల‌వ్ ట్రాక్ తో పాటు సంగీతం ప్రేక్షకులను స్వ‌ర్గంలోకి తీసుకువెళుతుందనేది టాక్. త్వరలో ఇబ్ర‌హీం ఈ ప్రాజెక్టుకు సంత‌కం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. యువ‌హీరో థ్రిల్లర్ నుండి రొమాన్స్ జాన‌ర్‌కి జంప్ చేయడం కూడా అత‌డి బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకునే ప్ర‌య‌త్నంగా అభివ‌ర్ణిస్తున్నారు.

డిసెంబరు 2023లో దిలేర్ సెట్స్ పైకి వెళుతుంది. దిలేర్ చిత్రాన్ని ప్రాథమికంగా లండన్‌లోని సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తారు. అయితే ఈ కొత్త వెంచర్‌ను ప్రారంభించడానికి ముందు, ఇబ్రహీం ధర్మ ప్రొడక్షన్స్ మూవీ 'సర్జమీన్' లో మిగిలిన షూట్ ని పూర్తి చేస్తాడు. ఫిబ్రవరిలో నిర్మాణంలోకి వచ్చిన ఈ థ్రిల్లర్ లో ఇబ్రహీం టెర్రరిస్టుగా ఛాలెంజింగ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజోల్ - పృథ్వీరాజ్‌లు పెళ్ల‌యిన‌ జంటగా నటించారు. దశాబ్ధం త‌ర్వాత కరణ్ జోహార్ -కాజోల్‌ల మొదటి సినిమా ఇది. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ కుమారుడు కయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా విడుదల తేదీ ఇంకా తెలియరాలేదు.

ఇబ్రహీం గురించి మ‌రింత వివ‌రాల్లోకి వెళితే.. అత‌డు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌కు డార్లింగ్ బోయ్ అత‌డు. ఇబ్రహీం ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మాత్ర‌మే ట‌చ్ లో ఉన్నాడు. అత‌డు తన తొలి చిత్రం విడుదలకు దగ్గర ప‌డే స‌మ‌యంలో పబ్లిక్ ఖాతాకు మారవచ్చని ఊహిస్తున్నారు. అత‌డి ప్రయాణంలో వేగం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇబ్ర‌హీం బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల‌తో బిజీ అయిపోతే, అటు కింగ్ ఖాన్ షారూఖ్ వార‌సుడి నుంచి ఎలాంటి అప్ డేట్ లేక‌పోవ‌డం విస్మ‌య‌ప‌రుస్తోంది.