Begin typing your search above and press return to search.

ఐబొమ్మ వైరల్ పోస్ట్ పై.. డైరెక్టర్ మండిపాటు!

అయితే ఇలాంటి సమయంలో వైరల్ అవుతున్న ఐబొమ్మ నోట్ ను తాజాగా షేర్ చేస్తూ.. ట్విట్టర్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పంచుకున్నారు కన్యాకుమారి మూవీ డైరెక్టర్ కం నిర్మాత సృజన్ అట్టాడ.

By:  Tupaki Desk   |   1 Oct 2025 7:18 PM IST
ఐబొమ్మ వైరల్ పోస్ట్ పై.. డైరెక్టర్ మండిపాటు!
X

సినిమా అంటే ఒకరి కష్టం.. దోచుకోవడం కాదు.. ఐబొమ్మపై డైరెక్టర్ మండిపాటు!

త్వరలోనే ఐబొమ్మ హెడ్ ను పట్టుకుంటాం అంటూ తెలంగాణ ఐపీఎస్ CV ఆనంద్ బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో గతంలో ఐబొమ్మ చేసిన ఒక ప్రకటనను ఇప్పుడు సీవీ ఆనంద్ ప్రకటనకు సవాల్ గా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇకపోతే ఐబొమ్మ ప్రస్తుతం ఇలాంటి ఒక నోట్ విడుదల చేయకపోయినా.. ఈ నోట్ వైరల్ అవ్వడంతో పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అత్యాధునిక టెక్నాలజీతో త్వరలోనే ఐబొమ్మ హెడ్ ను పోలీసులు పట్టుకుపోతున్నారని తెలుస్తోంది.

ఐబొమ్మను ప్రశ్నించిన కన్యాకుమారి డైరెక్టర్..

అయితే ఇలాంటి సమయంలో వైరల్ అవుతున్న ఐబొమ్మ నోట్ ను తాజాగా షేర్ చేస్తూ.. ట్విట్టర్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పంచుకున్నారు కన్యాకుమారి మూవీ డైరెక్టర్ కం నిర్మాత సృజన్ అట్టాడ. ఆయన తన ట్విట్టర్ వేదికగా.." ఐబొమ్మ నుండి వస్తున్న ఈ పోస్టును నేను చూశాను. వాళ్లు ప్రజల గురించి, సినిమా సంక్షేమం గురించి ఆందోళన చెందుతున్నట్లు ఆ నోట్లో కనిపిస్తోంది. అలాంటి మీరు నా సినిమా కన్యాకుమారిని మీ వెబ్ సైట్ లో ఎందుకు ఉంచారు? ఇది చిన్న సినిమా కదా.. ప్రధానంగా ఓటీటీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో.. కొంత అప్పులు చేసి, స్నేహితుల సహాయంతో ఈ సినిమా చేశాను. పైగా ఈ చిత్రానికి ఎటువంటి పారితోషకం కూడా తీసుకోలేదు. గత మూడు సంవత్సరాలు తీవ్రంగా కష్టపడి ఈ సినిమా చేశాను. కానీ మీరు మాత్రం వెంటనే మీ వెబ్సైట్లో నా సినిమాను పంచుకున్నారు.

సినిమా అంటే ఒకరి కష్టం.. దోచుకోవడం కాదు..

ఒక చిన్న సినిమా సాధించగల ఆదాయానికి మీరు నష్టం కలిగించారు. ఇది సమర్థనీయమేనా? మీలాంటి పైరసీ యాప్స్ వల్ల ఒక చిన్న సినిమా నిర్మాత ఎలా జీవించగలడు? మరొక సినిమా ఎలా తీయగలడు? సినిమా అనేది ఒకరు కష్టపడి సంపాదించిన డబ్బు.. మరొకరు కష్టపడి పనిచేయడం.. కొన్ని నిమిషాలలోనే డౌన్లోడ్ చేసుకోదగిన విషయం కాదు.. దయచేసి ఆలోచించండి.. అంటూ చాలా బాధతో పోస్ట్ పంచుకున్నారు సృజన్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఆలోచింపజేసేలా ఉందని సదరు సినీ ప్రేక్షకులు కూడా కామెంట్ చేస్తున్నారు.

కన్యాకుమారి సినిమా విశేషాలు..

సృజన్ దర్శకత్వం వహించి ,నిర్మించిన తెలుగు రొమాంటిక్ డ్రామా కన్యాకుమారి. ఆగస్టు 27 2025న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆ తర్వాత సెప్టెంబర్ 17న ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఇందులో గీత్ షైనీ, శ్రీ చరణ్ రాచకొండ ప్రధాన పాత్రలు పోషించారు.

కన్యాకుమారి కథ..

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలని కలలుకనే ప్రతిష్టాత్మక గ్రామీణ సేల్స్ గర్ల్ కన్యాకుమారి కథను.. అలాగే వారి గ్రామంలో పాతుకుపోయిన అంకితభావంతో ఉన్న రైతు తిరుపతితో ఆమెకున్న సంబంధాన్ని చాలా చక్కగా వివరించారు. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా చిన్న సినిమానే అయినా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.