ఆడియన్స్ ని మోసం చేయడం అంత ఈజీ కాదు?
ఒకప్పుడు సినిమా బాగుంటే చాలు అనుకునేవారు కానీ ఇప్పుడు జనం దాకా ఆ విషయం తీసుకెళ్లడం కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది.
By: Tupaki Desk | 19 Feb 2026 11:43 AM ISTసినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రమోషన్లు అనేవి ఒక పెద్ద ఛాలెంజింగ్ గా మారాయి. ఒకప్పుడు సినిమా బాగుంటే చాలు అనుకునేవారు కానీ ఇప్పుడు జనం దాకా ఆ విషయం తీసుకెళ్లడం కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ఈ క్రమంలో కొంతమంది మేకర్స్ అవసరానికి మించి హడావిడి చేస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలని చూస్తున్నారు. కానీ నేటి తరం ఆడియన్స్ చాలా స్మార్ట్. ఏది కంటెంట్ కోసం చేస్తున్న ప్రమోషన్, ఏది కేవలం హైప్ కోసం చేస్తున్న మాయ అనేది వాళ్లు ఈజీగా పసిగట్టేస్తున్నారు.
కేవలం సోషల్ మీడియాలో వచ్చే పాజిటివ్ కామెంట్లను చూసి మోసపోయే రోజులు ఇప్పుడు లేవు. మరోవైపు ప్రమోషన్లు అస్సలు చేయకపోవడం కూడా సినిమాలకి శాపంగా మారుతోంది. కథలో దమ్ముండి, నటీనటులు బాగా చేసినా సరే సరైన పబ్లిసిటీ లేక చాలా సినిమాలు థియేటర్లలో వెలవెలబోతున్నాయి. ఆ సినిమాలు థియేటర్ల నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఓటీటీలోనో లేదా టీవీలోనో చూసి అప్పుడు ప్రేక్షకులు సోషల్ మీడియాలో బాధపడుతుంటారు.
ఇంత మంచి సినిమాను ప్రమోట్ చేయడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారని, ముందే తెలిసి ఉంటే థియేటర్లోనే చూసేవాళ్లమని కామెంట్స్ చేయడం మనం తరచూ చూస్తుంటాం. ప్రమోషన్లకు భయపడి వెనకడుగు వేయడం వల్ల ఒక మంచి సినిమా జనాలకు రీచ్ కాకుండా పోతోంది. ప్రమోషన్ల కోసం ఖర్చు చేసే విషయంలో మేకర్స్ ఇప్పుడు రెండు కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ఫేక్ రివ్యూల మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల లాంగ్ రన్ లో ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ హడావిడి చూసి సినిమాకి వచ్చిన ఆడియన్స్ థియేటర్లో డిజప్పాయింట్ అయితే దాని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది.
అందుకే మేకర్స్ తాము చేసే ప్రమోషన్లు సినిమాలోని అసలైన సోల్ ని టచ్ చేసేలా ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన ఆర్భాటాల కంటే జెన్యూన్ గా సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మీద ఫోకస్ చేయాలి. కొత్త వాళ్లు లేదా చిన్న బడ్జెట్ సినిమాలు చేసే వాళ్లకు ఈ ప్రమోషన్లు అనేవి ఒక కత్తి మీద సాము లాంటివి. స్టార్ కాస్ట్ లేనప్పుడు సినిమా మీద అటెన్షన్ రావాలంటే కచ్చితంగా ఏదో ఒక వెరైటీ పబ్లిసిటీ స్టంట్ చేయాల్సి వస్తోంది.
అయితే అది లిమిట్ లో ఉన్నంత వరకు బాగుంటుంది. కానీ ప్రతి సినిమాను మాస్టర్ పీస్ అని ముందే ఫిక్స్ చేసేయడం వల్ల ఆడియన్స్ లో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయి చివరకు సినిమాకి నష్టం జరుగుతోంది. ఇలాంటి బ్యాలెన్స్ తప్పినప్పుడు ఎంత గొప్ప కంటెంట్ ఉన్నా ప్రేక్షకులు దాన్ని అంగీకరించడం కష్టమవుతుంది. నిజానికి ఆడియన్స్ సినిమా చూసి ఇచ్చే రివ్యూ కి ఉన్న వాల్యూ ఏ ప్రమోషన్ కి ఉండదు.
థియేటర్ నుండి వచ్చిన ఒక సామాన్యుడు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ మిగతా వంద మందిని థియేటర్ కి రప్పించగలదు. మేకర్స్ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని జెన్యూన్ మౌత్ టాక్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సోషల్ మీడియాలో కనిపించే లైకులు, షేర్లు సినిమాలను హిట్ చేయలేవు. సినిమా కథలో ఆడియన్స్ ని కట్టిపడేసే మ్యాజిక్ ఉంటే ఆటోమేటిక్ గా అదే టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది.
