సినిమాల పైరసీ కేసు.. ఆ ఒక్కడి వల్ల రూ.వందల కోట్ల నష్టం!
అయితే థియేటర్స్ లో ఒకడిగా కూర్చుని కిరణ్ సినిమా పైరసీ చేస్తాడట. ఆ తర్వాత పైరసీ చేసిన కాపీని మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీకి విక్రయిస్తున్నాడట.
By: Tupaki Desk | 3 July 2025 6:31 PM ISTసినీ ఇండస్ట్రీలో పైరసీ పెనుభూతంగా మారిన విషయం తెలిసిందే. ఇంకా థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవ్వడమే లేట్.. అక్కడికి కొన్ని గంటల్లో పైరసీ జరిగిపోతోంది. ఏకంగా హెచ్ డీ క్వాలిటీ ప్రింట్స్ కూడా ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతున్నాయి. థియేటర్స్ కు మించిన క్వాలిటీ కూడా ఒక్కోసారి ఉంటోంది.
దీంతో సినిమాల మేకర్స్ కు భారీ నష్టం జరుగుతోంది. అయితే పైరసీపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపడుతున్నారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం హైదరాబాద్ క్రైమ్ పోలీసులు.. కిరణ్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. అతడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
కొత్తగా సినిమాలు రిలీజ్ అవ్వడమే లేట్.. అతడు పైరసీ చేస్తున్నట్లు నిర్ధరించారు. విచారణలో కీలక విషయాలు కూడా రాబట్టారు పోలీసులు. నిందితుడు కిరణ్ 2019 నుంచి సినిమాలు పైరసీ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 65 సినిమాలను పైరసీ చేసినట్లు విచారణలో తేల్చారు.
అయితే థియేటర్స్ లో ఒకడిగా కూర్చుని కిరణ్ సినిమా పైరసీ చేస్తాడట. ఆ తర్వాత పైరసీ చేసిన కాపీని మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీకి విక్రయిస్తున్నాడట. అలా ఒక్క కాపీ ద్వారా రూ.40 వేల నుంచి గరిష్టంగా రూ. 80 వేలు సంపాదిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు సినిమాలకు రూ.80 వేల వరకు అందుకున్నాడట.
అక్కడ మరో విషయమేమింటే.. క్రిప్టో కరెన్సీ రూపంలో నిందితుడికి చెల్లింపులు జరిగినట్లు పోలీసులు ఇప్పుడు విచారణలో తేల్చారు. ఏది ఏమైనా కిరణ్ ఒక్కడి వల్ల సినీ ఇండస్ట్రీకి ఏకంగా రూ.3700 కోట్ల భారీ నష్టం జరిగిందని ప్రాథమికంగా పోలీసులు నిర్ధరించినట్లు తెలుస్తోంది.
అయితే కిరణ్ ఇటీవల రిలీజ్ అయిన హాష్ ట్యాగ్, సింగిల్ సినిమాలను కూడా పైరసీ చేసి విక్రయించాడు. దీంతో ఫిలిం చాంబర్ లోని యాంటి పైరసీ సెల్ ప్రతనిధి యర్ర మణీంద్ర బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కిరణ్ ఏసి టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు.
