కుమారుడిని పెద్ద స్టార్‌ని చేస్తామంటూ కేటుగాళ్లు కోట్లలో దోపిడీ!
నమ్మినవాడే నట్టేట మునుగుతాడు. నమ్మించి మోసం చేయడంలో కొందరు కేటుగాళ్ల పద్ధతే వేరు.
By: Sivaji Kontham | 12 Jun 2026 12:36 PM ISTనమ్మినవాడే నట్టేట మునుగుతాడు. నమ్మించి మోసం చేయడంలో కొందరు కేటుగాళ్ల పద్ధతే వేరు. గ్లామర్ ఫీల్డ్ లో ఈ బాపతు పెద్ద మనుషులకు కొదవేమీ లేదు. నమ్మితే మునిగపోయినట్టే. పెద్ద మనుషుల ముసుగులో కోట్లకు కోట్లు టోకరా వేసే ఘరానా మోసగాళ్లకు సినీపరిశ్రమలో కొదవేమీ లేదని ఇప్పటికే ప్రూవైంది. ఇప్పుడు అలాంటి మరో పంచాయితీ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సినీ ప్రపంచం అనేది ఎంతో మందిని ఆకర్షించే ఒక గ్లామర్ లోకం. వెండితెరపై మెరవాలనే కోరికతో సినిమా సర్క్యూట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రతి ఏటా లక్షలాది మంది యువతీ యువకులు ఎంతో ఆసక్తిని, పట్టుదలను ప్రదర్శిస్తుంటారు. అయితే అమాయక ప్రజలకున్న ఈ సినిమా కలలను ఆసరాగా చేసుకుని...వారిని నిలువునా దోచుకోవడానికి కొందరు కేటుగాళ్లు ఎప్పుడూ పొంచి ఉంటారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఒక దారుణమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాము సినీ నిర్మాతలమంటూ నమ్మించిన ఒక జంట.. వృద్ధ దంపతులను ఏకంగా రూ.4 కోట్లకు ముంచేసింది.
ఈ మోసానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఒక సినిమా నిర్మాణ సంస్థను నడుపుతున్నామని చెప్పుకున్న సదరు భార్యాభర్తలు, కూకట్‌పల్లికి చెందిన ఒక వృద్ధుడిని పరిచయం చేసుకున్నారు. అతని కుమారుడిని వెండితెరకు పరిచయం చేసి ఒక పెద్ద హీరోగా మారుస్తామని నమ్మబలికారు. సినిమా నిర్మాణ ఖర్చుల కోసం రూ.3.5 కోట్లు చెల్లించాలని.. ఈ చిత్రం ద్వారా భవిష్యత్తులో భారీ లాభాలు కూడా వస్తాయని వారు ఒక ఒప్పందం చేసుకున్నారు. వారి మాటలను పూర్తిగా నమ్మిన ఆ వృద్ధ తండ్రి కొడుకు బాగు కోసం ఆలోచించాడు. గత రెండు సంవత్సరాల కాలంలో విడతల వారీగా దాదాపు నగదును ఆ నకిలీ నిర్మాతలకు అందజేశారు.
అయితే రోజులు గడుస్తున్నా సినిమాకు సంబంధించిన ఎలాంటి ఊసే లేకపోవడంతో.. తాను ఘోరంగా మోసపోయానని ఆ వృద్ధుడు గ్రహించారు. దాంతో సదరు దంపతులను కలిసి తన డబ్బును తిరిగి ఇచ్చేయాలని కోరారు. కానీ ఆ కేటుగాళ్లు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. ఎదురు తిరిగి కుమారుడి కెరీర్‌ను నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడికి ఏం చేయాలో పాలుపోక చివరకు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి... తన డబ్బును తిరిగి ఇప్పించాలని వేడుకున్నారు. సినీ పరిశ్రమ పేరుతో జరిగే ఇలాంటి ఘోరమైన మోసాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. అందుకే సినిమా వ్యాపారంలో ముఖ పరిచయం లేని, నమ్మకం లేని వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పుడు ఆ వృద్ధుడు కొడుకు కెరీర్ పేరుతో సుమారు 4కోట్ల వరకూ నష్టపోయినట్టు కథనాలొస్తున్నాయి. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ భారీగా ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
