హృతిక్ చేతికి క్రిష్ 4 బాధ్యతలు.. ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందంటే?
అయితే ఇటీవల దర్శకత్వ బాధ్యతల్ని తన కుమారుడు హృతిక్ రోషన్ కి అప్పగిస్తూ రాకేష్ రోషన్ చేసిన ప్రకటన చాలామందిని ఆశ్చర్యపరిచింది.
By: Tupaki Desk | 3 May 2025 10:30 PM`క్రిష్` ఫ్రాంఛైజీలో వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ వసూళ్లతో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. సూపర్ హీరోగా `లార్జర్ దేన్ లైఫ్` పాత్రల్లో నటించిన హృతిక్ రోషన్ కి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. పిల్లలు, పెద్దలు సహా ఫ్యామిలీ ఆడియెన్‌లో ఈ ఫ్రాంఛైజీకి గొప్ప క్రేజ్ తేవడంలో హృతిక్ ఛరిష్మా వర్కవుటైంది. అయితే క్రిష్ 4 ప్రారంభించేందుకు రాకేష్ రోషన్ కి చాలా ఏళ్లు పట్టింది. దీనికి రకరకాల కారణాలు. ఆయన అనారోగ్యం.. బడ్జెట్ పరిధి- మారిన కాన్వాస్ ఇలా చాలా కారణాలు ఉన్నాయి.
అయితే ఇటీవల దర్శకత్వ బాధ్యతల్ని తన కుమారుడు హృతిక్ రోషన్ కి అప్పగిస్తూ రాకేష్ రోషన్ చేసిన ప్రకటన చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతారనేది ఎవరూ ఊహించనిది. కానీ అకస్మాత్తుగా తన కుమారుడు హృతిక్ రోషన్ `క్రిష్ 4`కి దర్శకత్వం వహిస్తాడని ప్రకటించి అందరికీ షాకిచ్చారు.
అయితే ఆ క్షణం అతడికి అది ఎంతో ఉద్విగ్న క్షణం. రాకేష్ రోషన్ ఆ సమయంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యారని హృతిక్ సోదరి సునైనా రోషన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎమోషన్ తట్టుకోలేక తన తండ్రి రాకేష్ రోషన్ ఏడ్చేశారని, అది చూసి తాను కూడా ఏడ్చేశానని సునైన తెలిపారు. సునైన చెప్పిన దానిని బట్టి ఒక పెద్ద బాధ్యతను తనయుడికి అప్పగించిన రాకేష్ రోషన్ ఎంతగా ఎమోషనల్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. అయితే హృతిక్ ఇంత పెద్ద ఫ్రాంఛైజీ చిత్రానికి దర్శకుడు అవుతాడని అభిమానులు కూడా కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే అందరూ సర్ ప్రైజ్ అయ్యారు. హృతిక్ లో దర్శకుడు కూడా ఉన్నాడా? అని అంతా ఆశ్చర్యపోయారు. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రానికి ఒక డెబ్యూ దర్శకుడిగా అతడు న్యాయం చేస్తాడా? అంటూ షాక్ కి గురయ్యారు. కానీ తన తండ్రి రాకేష్ రోషన్ కి సీన్లు మార్చాలంటూ సలహా ఇచ్చిన తెలివితేటలు, దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా అనుభవం ఉన్నాయని సునైన తెలిపారు. తన సోదరుడు హృతిక్ దర్శకత్వం వహించగల సమర్థుడు అని సునైన అన్నారు. 2026 ప్రథమార్థంలో `క్రిష్ 4` ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో హృతిక్ త్రిపాత్రాభినయం చేస్తారని కథనాలొస్తున్నాయి. ప్రియాంక చోప్రా, కంగన, ప్రీతి జింతా తిరిగి ఈ ఫ్రాంఛైజీలో నటిస్తారు.