వార్ 2 ప్రీరిలీజ్: హృతిక్ రోషన్‌కే మైండ్ బ్లాక్
బాలీవుడ్ ప్రమోషనల్ స్ట్రాటజీతో పోలిస్తే టాలీవుడ్ లో ప్రమోషనల్ స్ట్రాటజీ చాలా భిన్నంగా ఉంటుంది.
By: Sivaji Kontham | 10 Aug 2025 10:57 PM ISTబాలీవుడ్ ప్రమోషనల్ స్ట్రాటజీతో పోలిస్తే టాలీవుడ్ లో ప్రమోషనల్ స్ట్రాటజీ చాలా భిన్నంగా ఉంటుంది. హిందీ హీరోలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కానీ, అభిమాన సంఘాల హడావుడి అంతగా ఉండదు. అదే తెలుగు హీరోలకు అయితే అభిమాన సంఘాల హడావుడి పీక్స్ లో ఉంటుంది. అభిమానులు రోడ్డున పడి చొక్కాలు చించుకుంటారు. ఇక ప్రీరిలీజ్ వేడుకల కోసం బండెనక బండి కట్టి సుదూర తీరాల నుంచి కూడా అభిమానులు ఈవెంట్లకు వచ్చి వెళుతుంటారు. కొన్నిసార్లు స్టార్ హీరోల సినిమా వేడుకలలో అపశ్రుతులు కూడా చోటు చేసుకున్న సందర్భాలు ఉంటాయి. ఇలాంటి అనుభవాలు ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి చాలా ఎక్కువ.
ఈరోజు సాయంత్రం `వార్ 2` ప్రీరిలీజ్ వేడుక వద్ద యంగ్ యమ ఫ్యాన్స్ పోటెత్తిన తీరు చూస్తుంటే, అసలు ఈ క్రౌడ్ ని ఎలా మ్యానేజ్ చేసారు? అనే సందేహం కలగక మానదు. ఆదివారం అయినా పోలీసులు ఈవెంట్ చుట్టూ పహారా కాసారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్లు నటించిన వార్ 2 ఈ సీజన్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా విడుదలకు వస్తుంటే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రానికి అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఆగస్టు 24న రజనీకాంత్ కూలీతో పోటీపడుతూ వార్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
ఈ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో అత్యంత భారీగా జరుగుతున్న వార్ 2 ప్రీరిలీజ్ వేడుక కోసం హృతిక్ రోషన్ ముంబై నుంచి వచ్చారు. హృతిక్, ఎన్టీఆర్ పక్కపక్కనే కూచుని అభిమానుల హంగామా ఎలా సాగుతోందో ప్రత్యక్షంగా చూశారు. మరోవైపు యాంకర్ సుమ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల యాంకర్ విజువల్స్ (ఏవీ లు) ప్రదర్శిస్తూ వారి గురించి బ్రీఫింగ్ ఇచ్చింది. అలాగే వార్ 2 డైలాగ్ ప్రోమోని కూడా వేదికపై మరోసారి లాంచ్ చేసారు. అయితే ఎన్టీఆర్ మాస ఫ్యాన్స్ సందడి, ప్రీలీజ్ హంగామా బహుశా హృతిక్ రోషన్ ఎప్పుడూ చూసి ఉండడు. బాలీవుడ్ లో ఇలాంటి భజంత్రీ వేడుకలు చాలా తక్కువ కాబట్టి వీటిపై అతడికి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. హిందీ చిత్రసీమలో వేదికపై సింపుల్ గా హీరో, హీరోయిన్, దర్శకనిర్మాతలు కూచుని మీడియాతో మాట్లాడి వెళ్లిపోతుంటారు. మీడియా అడిగే ప్రశ్నలకు జవాబులిచ్చి సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తారు. దీనికి మహా అయితే ఒక గంట సమయం సరిపోతుంది. కానీ ఈరోజు సాయంత్రం నుంచి మిడ్ నైట్ వరకూ జరిగిన ఈవెంట్లో హృతిక్ నేరుగా తారక్ ఫ్యాన్స్ హంగామ చూసారు. వేదిక వద్ద ఎన్టీఆర్ మాస్ ఫ్యాన్స్ చొక్కాలు విప్పి సృష్టించిన వీరంగం కూడా హృతిక్ ప్రత్యక్షంగా చూసాడు. ఇకపోతే తన కెరీర్ పాతికేళ్లు పూర్తి చేసుకున్నా ఇన్ని సంవత్సరాలలో హృతిక్ రోషన్ ఎప్పుడూ హైదరాబాద్ లో సందడి చేసింది లేదు. చాలా అరుదుగా మాత్రమే అతడిని చూడగలిగాం. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ చెంతనే కూచుని అతడు షోని ఆస్వాధిస్తుంటే అది కన్నుల పండుగను తలపించింది. ఈవెంట్ ఇప్పటికీ ఇంకా అదే జోష్ తో కొనసాగుతూనే ఉంది.. తారక్ ఫ్యాన్స్ లో జోష్ ఎంతమాత్రం తగ్గలేదు... ఒక పొలిటికల్ మీటింగ్ కి వచ్చినట్టు ఇంతమంది జనం రావడాన్ని చూసి బహుశా హృతిక్ కి మైండ్ బ్లాక్ అయిందంటే అతిశయోక్తి కాదు.
