రెండేళ్లలో 100కోట్లు.. రియల్ ఎస్టేట్‌లో స్టార్ హీరో పెట్టుబడి
హృతిక్, అతడి తండ్రి రాకేష్ రోషన్ కి చెందిన కంపెనీ HRX డిజిటెక్ ఎల్.ఎల్.పి, ముంబైలోని చండివాలి ప్రాంతంలో మూడు ఆఫీస్ స్పేస్ లను రూ 31 కోట్లకు కొనుగోలు చేసింది.
By: Srikanth Kontham | 15 Aug 2025 10:58 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన `వార్ 2` ఈ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఈ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్న హృతిక్ రోషన్ కి సంబంధించిన మరో శుభవార్త తెలిసింది.
హృతిక్, అతడి తండ్రి రాకేష్ రోషన్ కి చెందిన కంపెనీ HRX డిజిటెక్ ఎల్.ఎల్.పి, ముంబైలోని చండివాలి ప్రాంతంలో మూడు ఆఫీస్ స్పేస్ లను రూ 31 కోట్లకు కొనుగోలు చేసింది. అంధేరీ తూర్పులోని చండివాలి ప్రాంతంలోని బూమరాంగ్ భవనం మొదటి అంతస్తులో ఈ అపార్ట్ మెంట్లు ఉన్నాయి. మొత్తం 13,546 చదరపు అడుగుల కార్పెట్ విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తిని 9 జూలై 2025న రిజిస్టర్ చేసారు. సుమారు 2కోట్ల స్టాంప్ డూటీ ఖర్చయింది.
ముంబై రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులు పెట్టడం హృతిక్ - రాకేష్ రోషన్ లకు ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది HRX డిజిటెక్ ఎల్.ఎల్.పి కోసం బూమరాంగ్ భవనంలోని ఐదవ అంతస్తులో ఐదు ఆఫీస్ యూనిట్లను రూ.37.75 కోట్లకు కొనుగోలు చేసారు. 17,389 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో ఇది విస్తరించి ఉంది. 2.5 కోట్లు స్టాంప్ డ్యూటీ వగైరా ఖర్చయ్యాయి. ముంబై అంధేరిలో గత ఏడాది మూడు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లను రూ.6.75 కోట్లకు విక్రయించారు. ఈ రెండేళ్లలోనే 100 కోట్ల పెట్టుబడులతో అపార్ట్ మెంట్లను కొనుగోలు చేయడం చూస్తుంటే రోషన్ ల సంపాదన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంధేరిలో బాలీవుడ్ దిగ్గజాలు చాలామంది పెట్టుబడులు పెట్టారు. అక్కడ రియల్ ఎస్టేట్ ఊపందుకోవడానికి సెలబ్రిటీ పెట్టుబడులు ప్రధాన కారణం. కింగ్ ఖాన్ షారూఖ్ సహా కార్తీక్ ఆర్యన్ లాంటి స్టార్ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉంటారు. అంధేరీ సినిమా మరియు వినోద పరిశ్రమకు ప్రధాన పెట్టుబడి హాట్‌స్పాట్‌గా మారడానికి ఇక్కడ అన్ని వైపులకు రోడ్ కనెక్టివిటీ ప్రధాన కారణం.
