తొలి దర్శకత్వం.. నెర్వస్ ఫీలవుతున్న హృతిక్
స్టార్ హీరోగా ఎంతో సాధించినా, దర్శకుడు అవ్వడం అంటే ఆషామాషీ కాదు. మొదటి చిత్రానికి పని చేసేప్పుడు టెన్షన్ నిలువనీయదు.
By: Tupaki Desk | 7 April 2025 5:00 AM ISTస్టార్ హీరోగా ఎంతో సాధించినా, దర్శకుడు అవ్వడం అంటే ఆషామాషీ కాదు. మొదటి చిత్రానికి పని చేసేప్పుడు టెన్షన్ నిలువనీయదు. అది కూడా 1000 కోట్ల బడ్జెట్ సినిమాకి దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది హృతిక్. అందుకే అతడు చాలా నెర్వస్ గా ఉందని అన్నాడు.
చాలా కాలం వేచి చూసిన తర్వాత మోస్ట్ అవైటెడ్ `క్రిష్ 4` ఎట్టకేలకు సెట్స్ పైకి వెళుతోంది. సూపర్ హీరో ఫ్రాంచైజీలో కథానాయకుడిగా నటించిన హృతిక్ రోషన్ నాల్గవ భాగంతో దర్శకుడిగా మారుతున్నాడు. మార్చి చివరిలో సోషల్ మీడియాలో రాకేష్ రోషన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇటీవల జార్జియాలోని అట్లాంటాలో జరిగిన ఒక కార్యక్రమానికి హృతిక్ హాజరయ్యారు. అక్కడ ఆయన `క్రిష్ 4`కి దర్శకత్వం వహించడం గురించి మాట్లాడారు.
మొదటిసారిగా దర్శకుడిగా మారడం గురించి హృతిక్ మాట్లాడుతూ.. నేను ఎంత భయపడుతున్నానో.. నాకు సాధ్యమైనంత ప్రోత్సాహం అవసరం! అని ఆయన అన్నారు. అభిమానులు ఆ సమయంలో అతడిని ఉత్సాహపరుస్తూ నినదించారు. 25 సంవత్సరాల క్రితం తనయుడు హృతిక్ ని నటుడిగా పరిచయం చేసిన రాకేష్ రోషన్ ఒక ఎమోషనల్ నోట్ రాస్తూ..పాతికేళ్ల తర్వాత #క్రిష్ 4 ను ముందుకు తీసుకెళ్లడానికి మిమ్మల్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాము.. శుభాకాంక్షలు.. ఈ కొత్త పదవిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
క్రిష్ ఫ్రాంచైజ్ 2003లో కోయి మిల్ గయాతో ప్రారంభమైంది. హృతిక్ - ప్రీతి జింటా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. క్రిష్ (2006)లో ప్రియాంక చోప్రా తారాగణంతో చేరగా ఇది కూడా బ్లాక్ బస్టర్ సాధించింది. క్రిష్ 3 చిత్రం 2013లో విడుదలైంది. సూపర్ హీరో చిత్రం క్రిష్ 3లో కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్ విలన్లుగా నటించారు. క్రిష్ 4 లో ఓ పాత్ర కోసం నోరా ఫతేహిని సంప్రదించారని కథనాలొచ్చాయి. ప్రీతి జింతా `లాహోర్ 1947`లో సన్నీ డియోల్‌తో కలిసి బాలీవుడ్‌లోకి తిరిగి ఎంట్రీ ఇస్తోంది. ఇదే సమయంలో క్రిష్ 4లోను కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. `క్రిష్ 4` నిర్మాతలు ఇంకా సినిమా తారాగణం, విడుదల తేదీని ప్రకటించలేదు. రాకేష్ రోషన్- ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
