క్రిష్ 4: హృతిక్ త్రిపాత్రల కోసం ఆ ముగ్గురు
ప్రస్తుతం హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న `వార్ 2` పోస్ట ప్రొడక్షన్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 July 2025 9:41 AM ISTప్రస్తుతం హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న `వార్ 2` పోస్ట ప్రొడక్షన్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కూడా హృతిక్ మరింత బిజీగా మారిపోతాడు. అతడు తదుపరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ `క్రిష్ 4`ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు ఫ్రాంఛైజీ దర్శకనిర్మాత రాకేష్ రోషన్ స్వయంగా తన కుమారుడు హృతిక్ ఈ కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని అధికారికంగా ప్రకటించారు.
దీంతో హృతిక్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాడని క్లారిటీ వచ్చింది. అదే సమయంలో అతడు క్రిష్ 4లో త్రిపాత్రాభినయం చేయబోతున్నాడనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు త్రిపాత్రల కోసం కథానాయికలు కూడా ఫిక్సయ్యారు. మోస్ట్ అవైటెడ్ సూపర్ హీరో డ్రామా క్రిష్ 4 లో ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, రేఖ నటిస్తారు. తాజా సమాచారం మేరకు.. ఆ ముగ్గురి హీరోయిన్ల రాకతో ప్రాజెక్ట్ కి కొత్త కళ వచ్చింది. క్రిష్ కథాంశం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ప్రపంచానికి ఒక పెద్ద ముప్పును తొలగించడానికి గతంలోకి భవిష్యత్తులోకి వేర్వేరు కాలాల ద్వారా వెళ్ళాలనే ఒక వ్యక్తి ప్రయోగానికి సంబంధించిన కథాంశమిది. భారీ సెట్లు, వీఎఫ్ఎక్స్ కి ఎక్కువ పని పడుతుందని తెలిసింది. అదే సమయంలో ఫ్యామిలీ ఎమోషన్స్ తగ్గకుండా కథలో కాన్ ఫ్లిక్ట్ ఉంటుందని కూడా తెలుస్తోంది.
ఈ సినిమా బాలీవుడ్‌కు పూర్తిగా కొత్తగా ఉండబోతోంది. ఇది టైమ్ ట్రావెల్ అంశాలతో రక్తి కట్టిస్తుందని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం YRF స్టూడియోస్‌లో క్రిష్ 4 కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రీ విజువలైజేషన్ కోసం ప్రఖ్యాత వీఎఫ్ఎక్స్ బృందం పనిచేస్తోంది. స్క్రిప్ట్‌ను మెరుగుపరచడానికి హృతిక్ తన రచయితల బృందం సహా నిర్మాత ఆదిత్య చోప్రాకు సహకరిస్తున్నారు. ఈ చిత్రం 2026 మొదటి త్రైమాసికంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. `కోయి మిల్ గయా` విడుదలైన 23 సంవత్సరాల తర్వాత క్రిష్ 4 తెరకెక్కుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది.
