ఇండియన్ మూవీస్‌కు ఆ సత్తా ఉందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన `బాహుబలి` సిరీస్ టాలీవుడ్ స్వరూపాన్నే కాకుండా ఇండియన్ సినిమా గమనాన్నే సమూలంగా మార్చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
By: Tupaki Desk | 20 Dec 2025 5:53 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన `బాహుబలి` సిరీస్ టాలీవుడ్ స్వరూపాన్నే కాకుండా ఇండియన్ సినిమా గమనాన్నే సమూలంగా మార్చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అప్పటి వరకు మూడు నుంచి రూ.30 కోట్ల బడ్జెట్‌తో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చిన టాలీవుడ్ మేకర్స్ `బాహుబలి` పాన్ ఇండియా హిట్‌తో ఒక్కసారిగా తమ ఆలోచనను మార్చుకున్నారు. తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరగడం, వివిధ రైట్స్ రూపంలో కోట్లల్లో రిటర్న్స్ వస్తుండటంతో ప్రతి ఒక్కరు కోట్ల బడ్జెట్‌తో సినిమాలు నిర్మించడం మొదలు పెట్టారు.
`బాహుబలి` సిరీస్ మూవీస్ ఫస్ట్ పార్ట్ రూ.650 కోట్లు, సెకండ్ పార్ట్ ఏకంగా రూ.1800 కోట్లు రాబట్టడంతో తెలుగు సినిమా సత్తా ఏంటో, దాని మార్కెట్ ఏంటో అందరికి తెలిసొచ్చింది. ఆ తరువాత నుంచి ప్రతి స్టార్, ప్రతి స్టార్ డైరెక్టర్ 60, 70 కోట్ల నుంచి వంద కోట్ల వరకు బడ్జెట్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపించడం స్టార్ట్ చేశారు. నాని లాంటి మీడియం రేంజ్ హీరో `దసరా`తో వంద కోట్ల క్లబ్‌లో చేరడం, విజయ్ దేవరకొండ లాంటి హీరో కూడా `గీత గోవిందం` లాంటి సినిమాతో వంద కోట్ల మార్కుని టచ్ చేయడంతో మిగతా హీరోలు కూడా ఇదే పంథాని అనుసరించడం మొదలు పెట్టారు.
ఇక బన్నీ చేసిన పాన్ ఇండియా మాస్ యాక్షన్ డ్రామా `పుష్ప` రూ.350 కోట్లు సాధించడం, ఆ తరువాత వచ్చిన `పుష్ప 2` ఏకంగా వరల్డ్ వైడ్‌గా రూ.1600 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడంతో తెలుగు సినిమా ఏ హాలీవుడ్ సినిమాకు తగ్గువ కాదనే వాదన మొదలైంది. 20, 30కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీయడానికే భయపడిన నిర్మాతలు ఇప్పుడు స్టార్లతో వందల కోట్లు పెట్టి సినిమాలు నిర్మించే స్థాయికి వచ్చేశారు.
'పుష్ప2 కు దాదాపుగా రూ.400 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు అట్లీతో బన్నీ చేస్తున్న ప్రాజెక్ట్‌కు ఏకండా రూ.800 కోట్లు ఖర్చు చేయబోతుండటం విశేషం. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ సినిమాగా దీన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. బడ్జెట్ ఈ రేంజ్‌లో ఖర్చు చేస్తున్నారంటే బిజినెస్ వెయ్యి కోట్లకు పైనే చేసే అవకాశం ఉంది. అంటే రిటర్న్స్ ఓ హాలీవుడ్ సినిమా రేంజ్‌లో ఉండటం ఖాయమేనని తెలుస్తోంది. 2026 ప్రారంభంలో రిలీజ్ కానున్న ప్రభాస్ `ది రాజా సాబ్` బడ్జెట్ రూ.400 కోట్లు.. ఇక పెద్ది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ `డ్రాగన్`, నాని `ది ప్యారడైజ్ పరిస్థితి కూడా ఇంతే.
వీటన్నింటికీ మించి మహేష్, జక్కన్నల కలయికలో రూపొందుతున్న `వారణాసి`ని ఏకంగా రూ.1300 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా బిజినెస్ కూడా ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. వసూళ్లు కూడా అంతకు మించి ఉండే అవకాశం ఉందని, హాలీవుడ్ దిగ్గజాలే ఆశ్చర్యపోయేలా ఈ సినిమా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఇప్పటి వరకు లోకల్ స్టోరీలు, భాషా అడ్డంకులు తెలుగు సినిమా బడ్జెట్‌ను పరిమితం చేశాయి. కానీ పాన్ వరల్డ్ కథలు, ఓటీటీ రీచ్, గ్లోబల్ ప్రమోషన్స్‌తో రానున్న 5 నుంచి 10 ఏళ్లలో మన సినిమాలు 5000 కోట్ల మార్కు నుంచి 15000 కోట్ల వరకు వసూళ్లని రాబడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
