Begin typing your search above and press return to search.

25 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం.. అగ్ర నిర్మాత కేసు!

స‌రిగ్గా రిలీజ్ ముంగిట‌, కాపీరైట్ సమస్యల కారణంగా ఇబ్బందుల్లో పడింది. `లాల్ పరి..` పాటను ఉపయోగించినందుకు కంపెనీపై మోఫ్యూజన్ స్టూడియోస్ కాపీరైట్ దావా వేసింది

By:  Tupaki Desk   |   14 May 2025 11:20 AM
25 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం.. అగ్ర నిర్మాత కేసు!
X

హౌస్‌ఫుల్ 5 ఈ సీజ‌న్ లో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ గా విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోంది. అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం 6 జూన్ 2025న విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్ప‌టికే మంచి బజ్‌ను క్రియేట్ చేసినా కానీ, ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో రిలీజ్ ఆల‌స్య‌మైంది. స‌రిగ్గా రిలీజ్ ముంగిట‌, కాపీరైట్ సమస్యల కారణంగా ఇబ్బందుల్లో పడింది. `లాల్ పరి..` పాటను ఉపయోగించినందుకు కంపెనీపై మోఫ్యూజన్ స్టూడియోస్ కాపీరైట్ దావా వేసింది.

ఆ త‌ర్వాత యూట్యూబ్ ఈ కంటెంట్ ని తొల‌గించింది. ఇప్పుడు హనీ సింగ్ ఈ పాట‌పై త‌న‌కు మాత్ర‌మే హ‌క్కును క‌లిగి ఉన్నార‌ని పేర్కొంటూ లిఖితపూర్వక ప్రకటన ఇచ్చిన తర్వాత `హౌస్‌ఫుల్ 5` నిర్మాతలు యూట్యూబ్, మోఫ్యూజన్ స్టూడియోస్‌పై పరువు నష్టం దావా వేసారు. బలమైన ఆధారాల ఆధారంగా, నిర్మాత చట్టపరమైన చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. నాడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ భారతీయ సినిమాలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటి.

ఎంతో ఖ‌ర్చు చేసి రూపొందించిన ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమా టీజ‌ర్ ని ఎలాంటి త‌నిఖీలు లేకుండా తొలగించిన విధానం అన్యాయమ‌ని నిర్మాణ సంస్థ వాదిస్తోంది. అందువల్ల మోఫ్యూజన్ స్టూడియోస్‌పై ప‌రువు న‌ష్టం దాఖ‌లు చేయ‌నున్నారు. ఎలాంటి త‌నిఖీలు లేకుండా యూట్యూబ్ నుంచి తొల‌గించ‌డంపై వారిపైనా ప‌రువు న‌ష్టం దాఖ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. న‌డియాద్వాలా గ్రాండ్‌సన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ 16 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి ఆరోప‌ణ‌లు లేవు. అయినా యూట్యూబ్ చెక్ చేయ‌కుండా త‌మ టీజ‌ర్ ని తొల‌గించింది. ఇప్ప‌టికే యూట్యూబ్ స‌హా ఫ్యూజ‌న్ కు నోటీసులు అందాయి. వెంటనే టీజర్‌ను తిరిగి అప్‌లోడ్ చేయాలని మేకర్స్ వారిని కోరారు. లేకపోతే నష్ట నియంత్రణ కోసం రూ. 25 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసారు.

హౌస్‌ఫుల్ 5 విష‌యానికి వ‌స్తే.. ఈ చిత్రానికి తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు. జాకీ ష్రాఫ్, సంజయ్ దత్, నానా పటేకర్, అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, శ్రేయాస్ తల్పాడే, ఫర్దీన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫఖ్రీ, సౌందర్య శర్మ, డినో మోరియా, నికితిన్ ధీర్, జానీ లివర్ త‌దిత‌రులు న‌టించారు.