సెన్సార్ బోర్డ్‌కు ఇవి కనిపించలేదా?
సెన్సార్ బోర్డ్ చిన్న చిన్న బూతు పదాలు ఉన్నా కూడా చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉండటం మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం.
By: Tupaki Desk | 10 Jun 2025 12:00 AM ISTబాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ హౌస్‌ఫుల్ నుంచి తాజాగా హౌస్‌ఫుల్ 5 వచ్చిన విషయం తెల్సిందే. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ స్టార్స్ నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్‌లు నటించడంతో అంచనాలు పెరిగాయి. ఇండియాలో హౌస్‌ఫుల్ ప్రాంచైజీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. అందుకు తగ్గట్లుగా ఈ సినిమా వినోదాత్మకంగా సాగింది. అయితే వినోదం పేరుతో ఈ సినిమాలో అసభ్య కంటెంట్‌ను చూపించారు అంటూ రివ్యూవర్స్‌తో పాటు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెల్సిందే. సెన్సార్ బోర్డ్ చిన్న చిన్న బూతు పదాలు ఉన్నా కూడా చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉండటం మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. అలాంటిది ఈ సినిమాలో బూతు కంటెంట్ చాలానే ఉంది. పిల్లలు చూడకూడని సీన్స్‌ను సైతం దర్శకుడు సినిమాలో పెట్టాడు. అలాంటప్పుడు ఎలా ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు అంటూ చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అడల్ట్ కంటెంట్ సీన్స్ సెన్సార్ బోర్డ్ వారికి కనిపించలేదా ఏంటి అంటూ తీవ్రంగా విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు. ఇలాంటి సినిమాలు పిల్లలు చూడటం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు.
ఆడవారి అవయవాలను అసభ్యంగా పోల్చుతూ కామెడీ చేయడంతో పాటు, రకరకాలుగా బూతులు మాట్లాడుతూ, కామెడీ పేరుతో ఒకరిని ఒకరు ఇష్టానుసారంగా కొట్టుకుంటూ చేసిన సీన్స్ విషయంలోనూ విమర్శలు వస్తున్నాయి. అసలు ఇలాంటి సినిమాలను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ ఎలా మీరు ప్రచారం చేశారు అంటూ మేకర్స్‌ను కొందరు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో దాదాపు నెల రోజులుగా ఈ సినిమాపై చేస్తున్న ప్రచారం నేపథ్యంలో అన్ని వర్గాల వారు ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్ద క్యూ కట్టారు. తీరా చూస్తే పిల్లలు ఈ సినిమాను చూసే విధంగా కొన్ని సీన్స్ లేవు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చిన్న చిన్న డైలాగ్స్ ఉన్నా కూడా సెన్సార్ బోర్డ్ వారు వాటిని తొలగించాలని ఆర్డర్ వేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డ్ ఎందుకు చూసి చూడనట్లు వదిలేసింది అంటూ నెటిజన్స్ సైతం ప్రశ్నిస్తున్నారు. సెన్సార్ బోర్డ్ మెంబర్స్ వారు ఏమైనా హౌస్‌ఫుల్ సినిమాకు అనుకూలంగా వ్యవహరించి ఉంటారా లేదంటే సెన్సార్ వారికి కూడా అందుకుండా మేకర్స్ బూతులను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారా అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కామెడీ పేరుతో ఇలాంటి చెత్తను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఎంత వరకు కరెక్ట్ అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో హౌస్‌ఫుల్ 5 బూతుల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
