సూపర్ హిట్ సీక్వెల్‌కి సెన్సార్ దెబ్బ గట్టిగానే...!
బాలీవుడ్ సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లి పోతున్నాయి. కరోనా తర్వాత చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి.
By: Tupaki Desk | 31 May 2025 7:02 AMబాలీవుడ్ సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లి పోతున్నాయి. కరోనా తర్వాత చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. హిందీ చిత్ర సీమలో సక్సెస్ రేటు దారణంగా పడి పోయింది. ఇలాంటి సమయంలో స్టార్ హీరోల సినిమాలు వస్తున్నా పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేక పోతున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా గత రెండు సంవత్సరాల్లో చాలా సినిమాలే వచ్చాయి. అందులో ఎన్ని సక్సెస్ అయ్యాయి అంటే వెంటనే చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద హీరోల సినిమాల విడుదలను సైతం ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. సినిమాకు హిట్ టాక్ వస్తే అప్పుడు చూద్దాం అన్నట్లుగా ప్రేక్షకులు ఉంటున్నారు అనిపిస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ నుంచి మరో భారీ చిత్రం రాబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సూపర్ హిట్ ప్రాంచైజీ 'హౌస్‌ఫుల్ 5' విడుదలకు సిద్ధం అవుతోంది. జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై బాలీవుడ్ మొత్తం ఆశ పెట్టుకుంది. అందుకు కారణం ఈ సినిమాలో అక్షయ్ కుమార్ మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్స్ పలువురు నటించారు. భారీ మల్టీస్టారర్ మూవీగా రూపొందిన హౌస్‌ఫుల్ 5 సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా కూడా గత చిత్రాల మాదిరిగానే ఉటుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే వారంలో విడుదల కాబోతున్న హౌస్‌ఫుల్ 5 సినిమాకు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. కొన్ని సీన్స్‌ను కట్ చేసి, కొన్ని డైలాగ్స్‌ను కట్ చేయడం ద్వారా హౌస్‌ఫుల్ 5 సినిమాకు యూ/ఎ ఇచ్చింది. ఆ కట్స్‌కు చిత్ర యూనిట్ సభ్యులు ఓకే చెప్పకుంటే సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డ్ సిద్ధం అయిందట. కొన్ని బూతు డైలాగ్స్, కొన్ని బూతు సంజ్ఞలతో పాటు, ఎక్కువ శాతం స్కిన్ షో షాట్స్‌ను సెన్సార్ బోర్డ్ వారు కట్ చేశారని తెలుస్తోంది. సెన్సార్ కట్స్ వల్ల హౌస్‌ఫుల్ 5 సినిమా కొన్ని కామెడీ సీన్స్‌ను మిస్ అయినట్లు బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
హౌస్‌ఫుల్ 5 సినిమాకు కామెడీ ప్రథానం. అలాంటి కామెడీ సీన్స్‌ను సెన్సార్ కట్ పేరుతో తగ్గించడం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. అదే నిజం అయితే కచ్చితంగా సినిమాకు గట్టి దెబ్బ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మేకర్స్ మాత్రం కొన్ని షాట్స్‌కి, కొన్ని డైలాగ్స్‌కు మాత్రమే సెన్సార్ పడింది. సినిమాలోని సన్నివేశాలు ఎక్కడ ప్రభావితం అయ్యే అవకాశం లేదు అంటూ అభిమానులకు మేకర్స్ హామీ ఇస్తున్నారు. ఈ విషయం గురించి చిత్ర యూనిట్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో అక్షయ్ కుమార్‌తో పాటు రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్, చుంకీ పాండే, జానీ లివర్ తదితర నటీనటులు ఈ సినిమాలో నటించారు.