Begin typing your search above and press return to search.

నా సామీ రంగ.. ఏమవుతుందో..?

ఇక శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న మరో చిత్రం నాగార్జునతో నా స్వామిరంగ. ఈ చిత్రం రీసెంట్​గా షూట్ మొదలుపెట్టుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.

By:  Tupaki Desk   |   1 Oct 2023 3:45 AM GMT
నా సామీ రంగ.. ఏమవుతుందో..?
X

ఇండస్ట్రీలో ఓ సినిమా హిట్​ అయినా ఫ్లాప్​ టాక్ అందుకున్న.. దానికి సంబంధించిన పరిణామాలను ఎదుర్కోవాల్సింది మొట్టమొదట నిర్మాతనే. ఎందుకంటే హిట్​ అయితే లాభాలను ఎలా అందుకుంటారో.. ఫ్లాప్ అయితే నష్టాలను కూడా అలానే చూడాల్సి వస్తుంది. అయితే ఒక డిజాస్టర్ పడితే ఓకే.. తర్వాతి చిత్రంతోనో లేదంటే ఇంకో చిత్రంతోనే రికవరీ చేసుకోవడానికి ప్రయత్నించొచ్చు.

అదే వరుసగా నాలుగైదు దెబ్బలు తగిలితే మాత్రం కోలుకోవడమంటే కష్టమనే చెప్పాలి. దివాలా తీయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రస్తుతం శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ అధినేత శ్రీనివాస్ చిట్టూరి పరిస్థితి చూస్తే ఇలానే అనిపిస్తోంది. బోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఆయన తాజాగా నిర్మించిన కొత్త సినిమా 'స్కంద' కూడా చేతులెత్తేసింది.

ఈ చిత్రం ఓపెనింగ్స్ మంచిగా అందుకున్నప్పటికీ.. టాక్ కాస్త తేడాగా రావడంతో ఇకపై మంచి వసూళ్లను అందుకోవడం కష్టమనే అర్థమైపోయింది! భారీ బడ్జెట్​తో తెరకెక్కించిన ఈ సినిమా.. రామ్ కెరీర్​లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్​ను తెచ్చిపెట్టింది. కానీ దానికి ప్రయోజనం అందేలా కనిపించడం లేదు. లాంగ్​ రన్​ టైమ్​లో పెట్టిన పెట్టుబడి వస్తుందని చెప్పే పరిస్థితి కనపడటం లేదు.

శ్రీనివాస్ చిట్టూరి అంతకుముందు తీసిన చిత్రాల పరిస్థితి కూడా అంతే. గత ఆరేళ్ల నుంచి అన్నీ డిజాస్టర్లే. బడ్జెట్​ విషయంలో రాజీ పడకుండానే తెరకెక్కిస్తున్నారు. సినిమాకు కావాల్సిన హంగులన్నింటినీ అద్ది మరీ తీస్తున్నారు. కానీ దురదృష్టం వెంటాడుతోంది.

అక్కినేని నాగచైతన్యతో కస్టడీ(2023) తీయగా.. అంచనాలతో వచ్చి భారీ డిజాస్టర్​గా నిలిచింది. టాలెంటెడ్​ డైరెక్టర్​ వెంకట్ ప్రభు, విలక్షణ నటుడు అరవింద్ స్వామి విలన్​గా పనిచేసిన వర్కౌట్​ అవ్వలేదు. రామ్ పోతినేనితోనే... దర్శకుడు లింగుస్వామిని పెట్టి ది వారియర్(2022) సినిమా తీస్తే అది కూడా పెద్ద డిజాస్టర్​గా నిలిచింది. స్టార్ హీరోయిన్​ సమంతతో యుటర్న్(2018), మ్యాచో స్టార్​ గోపీచంద్​తో సీటిమార్(2021), ఊర్వశి రౌతేలాతో బ్లాక్ రోజ్​(2021)... అన్నీ ఇవే ఫలితాలను ఇచ్చాయి. కనీసం ఈ గాయాల నుంచి ఇప్పుడు స్కంద అయినా కోలుకునేలా చేస్తుందనుకుంటే అది కూడా అవ్వలేదు. గాయం మరింత పెద్దదైంది!

ఇక శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న మరో చిత్రం నాగార్జునతో నా స్వామిరంగ. ఈ చిత్రం రీసెంట్​గా షూట్ మొదలుపెట్టుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. కనీసం ఈ చిత్రం అయినా శ్రీనివాస్​ను కష్టాల్లో నుంచి బయటపడేస్తుందేమో చూడాలి.