Begin typing your search above and press return to search.

ఇది నా రేంజ్‌ : దేవి శ్రీ ప్రసాద్‌

కొత్త వారికి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన దీని ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది

By:  Tupaki Desk   |   29 Jun 2025 9:50 AM
ఇది నా రేంజ్‌ : దేవి శ్రీ ప్రసాద్‌
X

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు కొత్తగా దిల్‌ రాజు డ్రీమ్స్‌ను ప్రారంభించారు. కొత్త వారికి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన దీని ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు. విజయ్ దేవరకొండతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దిల్‌ రాజు డ్రీమ్స్ అనేది ఎంతో మంది కొత్త టెక్నీషియన్స్‌కి, నటీనటులకు జీవం పోస్తుందని నిర్మాత శిరీష్ అన్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. వారికి సరైన గుర్తింపు దక్కడం లేదు. అలాంటి వారికి ఇది కచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది అన్నాడు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న దేవి శ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ... ప్రతి మనిషికి ఫెయిల్యూర్‌ అనేది కన్ఫర్మ్‌గా వస్తుంది. క్లాప్స్‌ కొట్టేప్పుడు, క్రియేషన్‌ చేసేప్పుడు మన ఎనర్జీని సేవ్‌ చేసుకోకూడదు. మనం ఎనర్జీని దాచుకుని క్రియేషన్ చేస్తే ఫలితం గొప్పగా ఉండక పోవచ్చు అన్నాడు. పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ పాటను కేవలం ఐదు నిమిషాల్లో క్రియేట్‌ చేశాం. నా స్టూడియోలో కూర్చుని ఐదు నిమిషాల్లో ట్యూన్‌ చేసిన ఆ పాట ఈ రోజు హాలీవుడ్‌లో ఒక సినిమా కోసం కాపీ చేశారు. ఇంగ్లీష్ వారు ఆ పాటను కాపీ కొట్టారు. నేను ఇప్పుడు వారిపై కేసు పెట్టాలా వద్దా అనేది ఆలోచిస్తున్నాను.

ఒక ఇండియన్‌ మ్యూజిక్ డైరెక్ట్‌ తన ఇంట్లో కూర్చుని ఐదు నిమిషాల్లో ట్యూన్‌ చేసిన పాటను హాలీవుడ్‌లో కాపీ కొట్టాడు. వాడు కాపీ కొట్టడం నాకు సంతోషంగా ఉంది. అది మన రేంజ్ అని వాడు నాకు నిరూపించాడు అంటూ దేవి శ్రీ ప్రసాద్‌ వ్యాఖ్యలు చేశాడు. హాలీవుడ్‌లోని ఒక సినిమా కోసం ఊ అంటావా మావ ట్యూన్‌ను కాపీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ సినిమా ఏంటి, ఏ పాట అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. దేవి శ్రీ ప్రసాద్ మరేదైనా సందర్భంలో ఆ పాట గురించి, ఆ కాపీ గురించి మరింత క్లారిటీగా చెప్తాడేమో చూడాలి. దేవి శ్రీ ప్రసాద్‌ యొక్క స్థాయి, స్టామినా ఏంటి అనేది ఈ విషయం నిరూపిస్తుందని ఆయన ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఇరవై ఏళ్ల వయసులో 'దేవి' సినిమాతో సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌ టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే సినీ ప్రపంచంను సర్‌ప్రైజ్ చేశాడు. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలు చేశాడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు, అంతకు మించి విడుదల చేస్తూ వచ్చాడు. ఆయన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్నాడు. దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజికల్‌ హిట్స్ ఎన్నో ఉంటాయి. పుష్ప వంటి బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌లను కెరీర్‌ ఆరంభం నుంచే దక్కించుకుంటూ వచ్చాడు. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ ఈయన వరుస సినిమాలు చేసి భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.