టాలీవుడ్ లో హాలీవుడ్..ఇది వేరే లెవల్ వర్మా!
థాయ్ లాండ్ కు చెందిన వితాయ పన్సంగర్, జపాన్ కు చెందిన కాజికు కితాబురా ఓజీలో ప్రధాన విలన్ పాత్రలు పోషిస్తున్నారు.
By: Tupaki Desk | 15 July 2025 12:00 AM ISTటాలీవుడ్ నటులు హాలీవుడ్ కి వెళ్తే అదో పెద్ద గొప్ప. దేశానికి ఓ గర్వకారణం. మరి అదే హాలీవుడ్ నటులు టాలీవుడ్ కి దిగొస్తే! 'జైలర్' సినిమాలో విలన్ డైలాగ్ లాగే ఇది వేరే లెవల్ వర్మా? అన్నట్లే ఉంటుంది. అవును ఇప్పటి వరకూ హాలీవుడ్ టెక్నిషియన్లు భారతీయ చిత్రాల కోసం పనిచేసిన ఎంతో మందిని చూసాం. సీజీ వర్క్ పరంగా విదేశీ స్టూడియోల్లో తెలుగు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ జరగడం..ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రాలకు స్టంట్ మాస్టర్లుగా పని చేసిన ప్రఖ్యాత హాలీవుడ్ కొరియోగ్రాఫర్లు ఎంతో మంది.
అలాగే కొన్ని సినిమాలకు సినిమాటోగ్రఫీ సైతం అందించారు. 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్' లాంటి చిత్రాలతో ఈ ట్రెండ్ టాలీవుడ్ లో మొదలైంది. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం రాజమౌళి ఇద్దరు బ్రిటన్ నటుల్ని కూడా రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ లో హాలీవుడ్ నటుల లైనప్ చూస్తే మామూలుగా లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటస్తోన్న 'ఓజీ' సినిమా కోసం థాయ్, జపాన్ నటులు విలన్ పాత్రలు పోషిస్తున్నారు.
థాయ్ లాండ్ కు చెందిన వితాయ పన్సంగర్, జపాన్ కు చెందిన కాజికు కితాబురా ఓజీలో ప్రధాన విలన్ పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో ఘోరమైన గ్యాంగ్ స్టర్లు వీళ్లు. ఈ రెండు పాత్రలు చాలా బలంగా ఉంటాయి. అలాగే ప్రభాస్ హీరోగా నటించనున్న సందీప్ రెడ్డి చిత్రం 'స్పిరిట్' కోసం సౌత్ కోరియా నటుడు డాన్ లీ దిగుతున్నాడు. ఇందులో డాన్ లీ విలన్ గా నటిస్తున్నాడు. ఇండియాస్ మోస్ట్ అవైటైడ్ ప్రాజెక్ట్ ఎస్ ఎస్ ఎంబీ 29 కోసం ప్రముఖ హాలీవుడ్ నటుడు థార్ గ్రేస్ హేమ్స్ వ్రత్ ని విలన్ రోల్ కోసం ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ఇదే సినిమాలో మరో విలన్ గా ఓ నల్లజాతీయుడు నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇంకా బన్నీ హీరోగా అట్లీ తెరకెక్కిస్తోన్న చిత్రంలో విలన్ గా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ను సంప్రదిస్తున్నారు. ఆయన అంగీకరిస్తే ఎంత పారితోషికం అయినా చెల్లించి అయినా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని బట్టి టాలీవుడ్ ఏ రేంజ్ కి వెళ్లిందన్నది అద్దం పడుతుంది.
