అక్కడ పవన్ అభిమానులను కంట్రోల్ చేయగలరా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోంది. ఈ నెల 24న ఆయన కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ పక్కాగా ప్రేక్షకులను పలకరించబోతోంది.
By: Tupaki Desk | 18 July 2025 9:21 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోంది. ఈ నెల 24న ఆయన కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ పక్కాగా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సినిమాకు ప్రి రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ కూడా ఖరారయ్యాయి. ఉత్కంఠకు తెర దించుతూ ఈ రోజు ఆ విశేషాలను పంచుకుంది చిత్ర బృందం. హైదరాబాద్‌లో సినీ ఈవెంట్లకు అత్యధికంగా ఆతిథ్యమిచ్చిన శిల్ప కళా వేదిక లో ఈ ఈవెంట్ చేయబోతున్నారు.
ఒకప్పుడు ఈ వెన్యూ సినిమా ఈవెంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఇది ప్రయారిటీగా ఉండట్లేదు. అక్కడ స్టార్ హీరోల అభిమానులను కంట్రోల్ చేయడం కష్టం అవుతోంది. దీంతో ఓపెన్ గ్రౌండ్ వేదికలను ఎంచుకుంటున్నారు. దీని కంటే పెద్దదిగా ఉండే వేరే కన్వెన్షన్ సెంటర్లను చూసుకుంటున్నారు. ఐతే ‘దేవర’ ఈవెంట్ చేద్దాం అనుకున్న చోట తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తి ఆ ఈవెంట్ రద్దవడం, ‘పుష్ప’ రిలీజ్ టైంలో సంధ్య థియేటర్లో జరిగిన విషాదం.. లాంటి పరిణామాల తర్వాత పెద్ద హీరోల ఈవెంట్లను చేయడానికే భయపడిపోతున్నారు.
అనుమతులు కూడా అంత సులువుగా దొరకడం లేదు. ఇలాంటి టైంలో 'హరిహర వీరమల్లు' ప్రి రిలీజ్ ఈవెంట్‌ను శిల్పకళావేదికలో చేయాలనుకోవడం, ఇందుకు అనుమతులు రావడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. మామూలుగానే పవన్ సినిమా ఈవెంట్లకు క్రౌడ్‌ను కంట్రోల్ చేయడం కష్టం. పైగా మూడేళ్ల తర్వాత రిలీజవుతున్న ఆ సినిమా.. అందులోనూ ఆయన ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కోసం అభిమానులు ఎగబడే అవకాశముంది.
మరోవైపు ఈ ఈవెంట్‌కు ఏపీ, తెలంగాణ, కర్ణాటక.. ఇలా మూడు రాష్ట్రాలకు చెందిన మంత్రులు అతిథులుగా వస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ మేనేజ్ చేయడం అంత తేలిక కాదు. ఇది తెలంగాణ పోలీసులకు కూడా సవాలే. అనుమతులు ఇచ్చారంటే పకడ్బందీ ఏర్పాట్లు చేయడానికే సిద్ధమై ఉంటారు. అయినా సరే.. మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ ఈవెంట్లో పవన్ అభిమానులను కంట్రోల్ చేయడం సవాలే.
