హరి హర ..కింగ్‌డమ్ ఏంటీ నాన్నా పులి ఆట?
పార్ట్ 1 మరోసారి వాయిదా పడిందని, జూన్ 28న రిలీజ్ చేస్తున్నామని, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పోస్ట్ చేయడంతో అంతా అవాక్కయ్యారు.
By: Tupaki Desk | 10 Jun 2025 11:01 AM ISTపవర్ స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `హరి హర వీరమల్లు`.17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహాలో సాగే గజదొంగగా కనిపించనున్నారు. మొఘల్ సామ్రాజ్యం నాటి పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని జూన్ 12న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నామంటూ ఇటీవల టీమ్ ప్రకటించింది. క్రిష్‌తో పాటు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడటం పవన్ అభిమానుల్ని కలవరానికి గురి చేస్తోంది.
పార్ట్ 1 మరోసారి వాయిదా పడిందని, జూన్ 28న రిలీజ్ చేస్తున్నామని, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పోస్ట్ చేయడంతో అంతా అవాక్కయ్యారు. దీనిపై `హరి హర టీమ్ స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పింది. ఆ పోస్ట్‌లని నమ్మకండని, మా సోషల్ మీడియా ఖాతాల ద్వారా త్వరలోనే రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడం వల్లే `హరి హర విడుదల మరోసారి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.
ఇక దీనితో పాటు వాయిదా పడుతున్న మూవీ `కింగ్‌డమ్`. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ `కింగ్ డమ్`. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో సత్యదేవ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ కోసం గత కొన్ని నెలులగా రౌడీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. `లైగర్` తరువాత రౌడీ సైలెంట్ అయిపోవడంతో ఈ మూవీతో మళ్లీ ట్రాక్‌లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు.
అయితే ఈ సినిమా కూడా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. ముందు ఈ మూవీని మార్చి 28న రిలీజ్ చేస్తామని టీమ్ ప్రకటించింది. కానీ అది జరగలేదు. ఇక రీసెంట్‌గా జూలై 4న రిలీజ్ చేస్తున్నామంటూ మరో డేట్‌ని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ డేట్‌న కూడా `కింగ్‌డమ్ వచ్చే అవకాశం కనిపించడం లేదనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. అదే రోజు నితిన్ `తమ్ముడు` రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో `కింగ్‌డమ్` జూలై 4న రిలీజ్ అయ్యే ఛాన్సే లేదనే వాదన వినిపిస్తోంది.
`తమ్ముడు` జూలై 4న రిలీజ్ కానున్న నేపథ్యంలో `కింగ్‌డమ్`ని జూలై 25కు పోస్ట్ పోన్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో హరి హర వీరమల్లు, కింగ్‌డమ్ సినిమాల రిలీజ్‌ల కోసం ఎదురు చూస్తున్న అభిమానులు, సినీ లవర్స్ ఏంటీ నాన్నా పులి ఆట? అని వాపోతున్నారు. ఈ తరహాలో ఏ సినిమాలు వాయిదా పడలేదని, ఈ రెండు సినిమాలకే ఎందుకు ఇలా జరుగుతోందని అభిమానులు ఫీల్ అవుతున్నారట. మరి ఈ విషయం మేకర్స్ గమనిస్తున్నారో లేదో.