లైకా - విశాల్..ఈ మెగా ఎపిసోడ్‌కు అంతం ఎప్పుడో!
కానీ విశాల్ అలా చేయలేదు. తన సినిమాలని ఇతర డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు అమ్మేస్తూ వచ్చాడు. అంతే కాకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు.
By: Ravindar Gorantla | 19 Feb 2026 3:00 PM ISTకోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో విశాల్. తనదైన మాస్ యాక్షన్ డ్రామాలతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని రెండు దశాబబ్దాలుగా ఆకట్టుకుంటున్నారు. హీరోగా, నిర్మాతగా సినిమాలు చేస్తూ రెండు భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. వీటిలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తే మరికొన్ని ఫ్లాప్‌లుగా మారి భారీ నష్టాలని మిగిల్చాయి. వాటివల్లే హీరో విశాల్ కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరమైన వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలవడం తెలిసిందే. `తుప్పరివాలన్ 2` సినిమా విషయంలో దర్శకుడు మిస్కిన్‌తో ఏర్పడిన వివాదం కారణంగా మరో సారి వార్తల్లో నిలిచారు.
ఇదిలా ఉంటే కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో హీరో విశాల్ వివాదం మెగా ఎపిసోడ్‌ల సాగుతూ వస్తోంది. దీనికి ఎండ్ ఎప్పుడనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...విశాల్ తన `విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ` ద్వారా గోపురం ఫిల్మ్స్ సంస్థ నుంచి రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే ఆ అప్పును లైకా ప్రొడక్షన్స్ చెల్లించి ఆ మొత్తాన్ని తమకు చెల్లించే విధంగా విశాల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో పెద్ద మెలిక పెట్టారు. అదేంటంటే విశాల్ అప్పు తీర్చే వరకు తన సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు లైకాకే ఇవ్వాలి.
కానీ విశాల్ అలా చేయలేదు. తన సినిమాలని ఇతర డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు అమ్మేస్తూ వచ్చాడు. అంతే కాకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. లైకాకు ఇవ్వాల్సి మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన లైకా ప్రొడక్షన్స్ వర్గాలు కోర్టుని ఆశ్రయించాయి. విశాల్ తీసుకున్న అసలు రూ.21.29 కోట్ల అప్పు 30 శాతం వడ్డీతో కలిపి ఇప్పుడు రూ.57 కోట్లకు చేరింది. ఈ వివాదంపై లైకా, విశాల్ మధ్య వివాదం మెగా ఎపిసోడ్‌లా సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్టు హీరో విశాల్‌కు షాక్ ఇచ్చింది.
లైకా ప్రొడక్షన్స్‌కు సంబంధించిన కేసులో న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను పాటించేందుకు గడువు కోరుతూ నటుడు విశాల్ దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. లైకాకు చెల్లించాల్సిన రూ.21.29 కోట్ల అప్పును 30 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని హైకోర్టు సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ విశాల్ వేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ సందర్భంగా హీరో విశాల్ రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని పేర్కొంది.
అయితే ఆ భారీ మొత్తం డిపాజిట్ చేసేందుకు తనకు ఆరు వారాల గడుపు కావాలని విజ్ఞప్తి చేస్తూ విశాల్ పిటీషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం విశాల్ పిటీషన్‌ను కొట్టి వేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసి షాక్ ఇచ్చింది. దీంతో విశాల్ పెద్ద ఇరకాటంలో పడ్డారు. 2021లో విశాల్ -లైకాల మధ్య వార్ మొదలైంది. విశాల్ నటించిన `చక్ర` మూవీ కాపీరైట్ హక్కులు తమవేనని, ముందు ఆ డైరెక్టర్ ఆ కథని తమకే ఇచ్చారని లైకా వర్గాలు విశాల్ సినిమాపై కోర్టుకు వెళ్లారు. ఈ వివాదంలో లైకాకు షాక్ తగలగా, విశాల్ విజయం సాధించాడు. ఇప్పుడు లైకా వంతు రావడవం, విశాల్‌పై పైచేయి సాధించడంతో విశాల్ వర్సెస్ లైకా వివాదం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
