హక్కుల వివాదం: డబ్బు కోసం 25ఏళ్ల తర్వాతా బెదిరిస్తున్నారంటూ నిర్మాత ఆవేదన!
ఎప్పుడు కాపీ రైట్ హక్కులు అమ్మేసారు. ఆల్రెడీ కాపీరైట్స్ అమ్మేసిన సినిమాని మళ్లీ మరో నిర్మాతకు రైట్స్ అమ్మేసారు.
By: Tupaki Desk | 2 May 2026 1:08 PM ISTఎప్పుడు కాపీ రైట్ హక్కులు అమ్మేసారు. ఆల్రెడీ కాపీరైట్స్ అమ్మేసిన సినిమాని మళ్లీ మరో నిర్మాతకు రైట్స్ అమ్మేసారు. అంతేకాదు.. కాపీ రైట్స్ అమ్మేసినా.. ఇప్పటికీ ఆ సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలంటూ వేధిస్తున్నారు. ఈ బెదిరింపులు దఫదఫాలుగా సంవత్సరాల తరబడి తనను వెన్నాడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. 25 ఏళ్ల తర్వాత కూడా వేధింపులు భరించలేకపోతున్నానని ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నడియాద్వాలా ఆరోపించారు. ఈ ఘటనల పూర్తి వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ క్లాసిక్ కామెడీ చిత్రం `హేరా ఫేరి` కాపీరైట్ - రీమేక్ హక్కుల విషయంలో చిత్ర నిర్మాత ఫిరోజ్ నడియాద్వాలా ముంబైలోని అంబోలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన చట్టబద్ధమైన హక్కులను అక్రమంగా చేజిక్కించుకోవడానికి కొందరు వ్యక్తులు కుట్ర పన్నారని.. తనను బెదిరించి కోట్లలో వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వివాదం తన కంపెనీ పబ్లిక్ లిస్టింగ్ ప్రక్రియకు కూడా ఆటంకం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదానికి మూలం 1989లో విడుదలైన మలయాళ చిత్రం `రామ్జీ రావు స్పీకింగ్`. ఈ కథను దక్షిణాది భాషలు మినహా హిందీ,ఇతర భాషల్లో రీమేక్ చేసే హక్కులను తాను 2000వ సంవత్సరంలోనే 4.5 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు నడియాద్వాలా వివరించారు. అయితే సినిమా విడుదల సమయంలోనే తనను ఒత్తిడికి గురిచేసి డబ్బులు వసూలు చేశారని.. అప్పుడు కోర్టు తనకే అనుకూలంగా స్టే ఇచ్చినా... పరువు పోతుందనే భయంతో ఆ సమయంలో చెల్లింపులు చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అసలు చిత్రం యజమానులు సిద్ధిక్ కె.ఎల్ - ఎం. పాల్ మైఖేల్ హక్కులు ఇప్పటికే అమ్ముడయ్యాయని తెలిసి కూడా.. 2022లో గోపాల పిళ్లై విజయ్‌కుమార్‌కు కేవలం రూ. 3 లక్షలకు మళ్లీ విక్రయించారని నడియాద్వాలా ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గోపాల పిళ్లై విజయ్‌కుమార్- ఎం. పాల్ మైఖేల్‌పై సెక్షన్ 318(4), 356 కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
మరోవైపు 2006లో విడుదలైన తన హిట్ చిత్రం `ఫిర్ హేరా ఫేరి`ని రైట్స్ లేకుండా తీసారని తప్పుడు ప్రచారం చేస్తూ 2024 డిసెంబర్‌లో తనకు లీగల్ నోటీసు అందినట్లు నడియాద్వాలా తెలిపారు. ఆ నోటీసు ఇచ్చిన వారు తన నుంచి రూ. 60 లక్షలతో పాటు.. సినిమా మొత్తం లాభాల్లో 25 శాతం వాటా డిమాండ్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కేవలం డబ్బు కోసం చేస్తున్న వేధింపులేనని ఆయన స్పష్టం చేశారు.
అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ వంటి అగ్ర నటుల పేర్లను వాడుతూ తన వృత్తిపరమైన కీర్తిని దెబ్బతీయడానికి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని నడియాద్వాలా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దశాబ్దాల కాలం నాటి హక్కుల ఒప్పందాలు.. ప్రస్తుత తప్పుడు విక్రయాల చుట్టూ తిరుగుతున్న ఈ కేసు బాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
