Begin typing your search above and press return to search.

ఆయన లేకుండా సూపర్‌ హిట్‌ ప్రాంచైజీ సాధ్యమా?

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ 'హేరా ఫేరి' ప్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. హేరా ఫేరి ప్రాంచైజీలో మూడో పార్ట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 May 2025 7:00 PM IST
ఆయన లేకుండా సూపర్‌ హిట్‌ ప్రాంచైజీ సాధ్యమా?
X

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ 'హేరా ఫేరి' ప్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. హేరా ఫేరి ప్రాంచైజీలో మూడో పార్ట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి రెండు పార్ట్‌ల్లో పరేష్ రావల్‌ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో రూపొందిన హేరా ఫేరి సినిమాలో పరేష్‌ రావల్‌తో పాటు అక్షయ్‌ కుమార్‌ ముఖ్య పాత్రలో నటించాడు. మూడో పార్ట్‌ విషయమై చర్చ జరుగుతున్న సమయంలోనే హేరా ఫేరి నుంచి తప్పుకుంటున్నట్లు సీనియర్‌ నటుడు పరేష్ రావల్‌ చేసిన ప్రకటన ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

ఇటీవల అక్షయ్‌ కుమార్ నటించిన సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగింది. మీడియా వారు అక్షయ్‌ కుమార్‌ను హేరా ఫేరి సినిమా నుంచి పరేష్‌ రావల్‌ తప్పుకోవడం గురించి ప్రశ్నించారు. అక్షయ్‌ కుమార్‌తో పరేష్ రావల్‌కి ఉన్న విభేదాల కారణంగానే తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి, ఇంతకు మీ ఇద్దరు మళ్లీ కలిసి నటించే అవకాశాలు ఉన్నాయా అంటూ మీడియా వారు ప్రశ్నించారు. అందుకు అక్షయ్‌ కుమార్‌ నుంచి ఆసక్తికర సమాధానం వచ్చింది. పరేష్ రావల్‌ అంటే తనకు చాలా అభిమానం, మా ఇద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి.

మేము ఇద్దరం సుదీర్ఘ కాలంగా కలిసి వర్క్‌ చేశాం, మేము ఇద్దరం చేసిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక మా ఇద్దరి మధ్య విభేదాలు అనేది కేవలం పుకార్లు మాత్రమే. మేము అంతా బాగానే ఉన్నాం. అయితే హేరా ఫేరి సినిమా గురించి మాట్లాడటానికి ఇది సరైన వేదిక కాదు, ఇది సమయం కాదు. ఇప్పుడు మా సినిమా ప్రమోషన్‌లో మాత్రమే ఉన్నాము. తదుపరి సినిమా గురించి ఇప్పుడు మేము ఏం చెప్పలేం. కనుక హేరా ఫేరి సినిమా ప్రాంచైజీ మూడో పార్ట్‌ గురించి ఇప్పుడు అడగవద్దు అన్నట్లుగా అక్షయ్‌ కుమార్‌ చెప్పుకొచ్చాడు. ఆయన మాటలను బట్టి చూస్తూ ఉంటే హేరా ఫేరి విషయంలో మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనేమో అనే అనుమానాలు కలుగుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రియదర్శన్‌, అక్షయ్‌ కుమార్‌, పరేష్ రావల్‌ లేకుండా హేరా ఫేరి సినిమా అనేది లేదు. ఈ ముగ్గురిలో ఎవరు లేకున్నా ఆ ప్రాంచైజీని జనాలు ఆధరించడం కష్టం. అందుకే పరేష్ రావల్‌ లేకుండా మూడో పార్ట్‌ను ముందుకు తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా అంటూ బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్షయ్‌ కుమార్‌ మాత్రం హేరా ఫేరి సినిమా పట్ల ఉన్న అభిమానం కారణంగా మూడో పార్ట్‌ విషయంలో చాలా ఆసక్తిని కనబర్చుతున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే సీక్వెల్‌ గురించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అక్షయ్‌ చేస్తున్న సీక్వెల్స్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. కనుక హేరా ఫేరి విషయంలో అక్షయ్ సీరియస్‌గా ఉన్నాడు. పరేష్ రావల్‌ లేకుండానే ఈ సినిమా ముందుకు వెళ్తుందా అనేది చూడాలి.