హేరా ఫేరీ 3: అయ్యో బాబూరావు! మళ్లీ కలిసిపోయావా?
ముఖ్యంగా ఖిలాడీ అక్షయ్ కుమార్ ఈ ఫ్రాంఛైజీ మూడో సినిమాని నిర్మించేందుకు 10కోట్లు వెచ్చించి నిర్మాతల నుంచి రైట్స్ కొనుక్కున్నాడు.
By: Tupaki Desk | 30 May 2025 9:23 AM ISTప్రియదర్శన్ హేరాఫేరి 3 ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో పరేష్ రావల్ లాంటి సీనియర్ నటుడు ఈ ప్రాజెక్టు నుంచి సడెన్ గా నిష్కృమించడం, ఫ్రాంఛైజీ అభిమానులను తీవ్రంగా కలవరపాటుకు గురి చేసింది. పరేష్ ఇలా సినిమాకి కథా చర్చలు జరుగుతుండగా, మధ్యలో వదిలి వెళ్లిపోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది.
ముఖ్యంగా ఖిలాడీ అక్షయ్ కుమార్ ఈ ఫ్రాంఛైజీ మూడో సినిమాని నిర్మించేందుకు 10కోట్లు వెచ్చించి నిర్మాతల నుంచి రైట్స్ కొనుక్కున్నాడు. టెక్నీషియన్లు, ఆర్టిస్టులకు అడ్వాన్సులు ఇచ్చి అందరినీ ఎంపిక చేసుకుని ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లలో ఉన్నాడు.
ఇంతలోనే ఈ సినిమా నుంచి తప్పుకున్నాను! అంటూ ప్రకటించి నిర్మాత అయిన అక్షయ్ కి పెద్ద షాకిచ్చాడు. నిజానికి హేరాఫేరి ఫ్రాంఛైజీకి గుండెకాయ లాంటి పాత్ర బాబూరావు అలియాస్ బాబూ భయ్యాజీ పాత్ర. పరేష్ మాత్రమే దానికి సరిపోతాడు. వేరొక నటుడితో రీప్లేస్ చేయడం కుదరదు. అందుకే అక్కీ తీవ్రంగా కలతకు గురయ్యాడు. తన మనోవేదనను దాచుకోలేక, చివరికి పరేష్ పై కోర్టు పోరాటానికి కూడా పిటిషన్ వేసాడు. అయితే అక్షయ్ చెబుతున్న దాని ప్రకారం.. బాబూరావు పాత్రధారి అయిన పరేష్ కు తాను ఆశించిన దాని కంటే మూడు రెట్లు అదనంగా చెల్లించేందుకు అంగీకరించానని చెబుతున్నాడు. అయినా పరేష్ వెనక్కి తగ్గాడు. అతడు సినిమా నుంచి తప్పుకుంటున్నానని మొండిగా అన్నాడు. ప్రాజెక్ట్ అంతకంతకు ఆలస్యమవుతుండడంతో ఆ అసహనం అతడి నుంచి బయటపడిందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, చివరికి పరేష్ రావల్ ని బుజ్జగించి, బతిమాలి మొత్తానికి దారికి తెచ్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయని, ఖిలాడీ అక్షయ్ అతడు లేకుండా ఈ సినిమా తీయలేనని భావిస్తున్నాడట. ప్రస్తుతం ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు? కోర్టులోనే ఈ గొడవకు పంచాయితీ ముందుకు సాగుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ వివాదంపై మరిన్ని వివరాలు స్పష్ఠంగా వెలువడాల్సి ఉంది. రాజు వర్సెస్ బాబు భయ్యా గొడవ సద్దుమణగాలని ఆశిద్దాం.
మాట జారని అక్షయ్ స్వభావం కలుపుతుందా?
పరేష్ ఇటీవలే అక్షయ్ తో భూత్ బంగ్లా షూటింగును కూడా ముగించాడు. 15-20 రోజుల క్రితం వరకు అంతా సజావుగా సాగినా హేరాఫేరి 3 విషయంలో ఇద్దరి మధ్యా గొడవ మొదలైందని కూడా తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలో, ట్రోల్స్ నుండి పరేష్‌ను రక్షించడానికి అక్కీ ముందుకు వచ్చాడు. వారు ఇప్పటికీ `చాలా మంచి స్నేహితులు`.. నటుడిగా అతన్ని ఆరాధిస్తానని అక్షయ్ చెప్పాడు. వివాదంపై వ్యాఖ్యానించడానికి అతను నిరాకరించాడు. ఎందుకంటే ఇది ఇప్పుడు చట్టపరమైన విషయం. కోర్టులోనే ఏదైనా తేలాలి. అయితే మాట జారని అక్షయ్ జెంటిల్ మన్ వ్యక్తిత్వం పరేష్ ని తిరిగి ఫ్రాంఛైజీకి తెస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.
