నేను ఊహించిన జీవితం కాదు ఇది: హేమ మాలిని
ప్రతి స్త్రీ సాంప్రదాయబద్ధమైన కుటుంబ జీవనాన్ని కోరుకుంటుందని, భర్త- పిల్లలు కావాలనుకుంటుందని వ్యాఖ్యానించారు హేమ మాలిని.
By: Tupaki Desk | 29 July 2025 12:33 AM ISTప్రతి స్త్రీ సాంప్రదాయబద్ధమైన కుటుంబ జీవనాన్ని కోరుకుంటుందని, భర్త- పిల్లలు కావాలనుకుంటుందని వ్యాఖ్యానించారు హేమ మాలిని. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా సుప్రసిద్ధురాలైన హేమ మాలిని, అప్పటికే పెళ్లయిన బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ధర్మేంద్రను పెళ్లాడటం అప్పట్లో ఒక సెన్సేషన్. ప్రకాష్ కౌర్ అనే యువతిని పెళ్లాడిన అతడికి పిల్లలు ఉన్నారు. కానీ సహనటి హేమమాలినితో ప్రేమలో పడ్డాడు. ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఆఫ్ ద స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అప్పట్లో చాలా మీడియాల్లో సంచలన కథనాలు వచ్చాయి. ఆ తర్వాత 1980లో హేమమాలినిని ధర్మేంద్ర పెళ్లి చేసుకున్నారు. అయితే అతడు ఈ పెళ్లిని చట్టబద్ధం చేయలేదు. ఈ జంట అధికారికంగా కాపురం కూడా ప్రారంభించలేదు. అతడు హేమమాలినిని పెళ్లాడినా, తిరిగి తన భార్య పిల్లల వద్దకు వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
అయితే ఈ జీవితం తాను కోరుకున్నది కాదని హేమమాలిని చాలా సందర్భాల్లో అన్నారు. ఏ స్త్రీ అయినా సాంప్రదాయబద్ధంగా భర్త, పిల్లలతో హాయిగా కాపురం చేసుకోవాలనుకుంటుందని అన్నారు. ఇది తాను ఎప్పటికీ ఊహించనిది అని కూడా వ్యాఖ్యానించారు. తాజా ఇంటర్వ్యూలో మరోసారి హేమమాలిని తన జీవితంలో ఊహించని విషయాలు బయటపడ్డాయని అన్నారు. సాంప్రదాయ కుటుంబం కావాలనుకున్నా కొన్ని పరిస్థితులు ఊహించని విధంగా బయటపడతాయని, అంగీకారం మాత్రమే ముందుకు సాగే మార్గం అవుతుందని హేమ మాలిని అన్నారు. తన విషయంలో జరిగిన వాటికి తనకు విచారం లేదు.. కృతజ్ఞత మాత్రమే ఉన్నానని అన్నారు.
అయితే ధర్మేంద్ర ఏనాడూ తన పిల్లలకు లోటు చేయలేదని, వారి పెళ్లిళ్ల గురించి అందరు తండ్రుల్లాగే ఆందోళన చెందారని కూడా హేమమాలిని గుర్తు చేసుకున్నారు. తండ్రిగా కుమార్తెల పెంపకం విషయంలో ధర్మేంద్ర ఎలాంటి లోటు చేయలేదు. ఈ విషయంలో సంతృప్తిని వ్యక్తం చేసింది. ధర్మేంద్ర మా జీవితాల్లో ఒక భాగం అని అన్నారు. హేమ ఆత్మకథ `హేమ మాలిని: బియాండ్ ది డ్రీమ్ గర్ల్` లో ఇంకా చాలా జీవిత విషయాలను వెల్లడించారు. ధర్మేంద్రను పెళ్లాడొద్దని, జీతేంద్రను పెళ్లాడాలని కూడా తన తల్లి ఒత్తిడి చేసినట్టు హేమమాలిని ఆత్మకథలో వివరించారు. ధర్మేంద్ర- హేమమాలిని కలిసి 45 సినిమాల్లో నటించగా, అందులో 35 చిత్రాలు పూర్తిగా రొమాంటిక్ లవ్ స్టోరీలే కావడం గమనార్హం.
