హేమ కమిటీ కేసులు క్లోజ్.. కారణమేంటంటే
అయితే తాజాగా ఆ 35 కేసులను మూసి వేస్తున్నట్టు సిట్ కేరళ ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది.
By: Tupaki Desk | 26 Jun 2025 4:00 PM ISTమలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ను బయటపెట్టడంలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. హేమ కమిటీ రిపోర్ట్ ఆధారంగా 35 కేసులు నమోదవగా, వాటిపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటైంది. అయితే తాజాగా ఆ 35 కేసులను మూసి వేస్తున్నట్టు సిట్ కేరళ ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది.
2017 కొచ్చిలో ఓ మలయాళ నటి కిడ్నాప్ యావత్ మలయాళ ఇండస్ట్రీ మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేయగా, నటుడు దిలీప్ ఆమెపై రౌడీలతో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అధ్యయనం చేసేందుకు 2019లో కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ అధ్యక్షతన ఓ స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది.
దీంతో హేమ కమిటీ మాలీవుడ్ లో మహిళలు ఎదుర్కొంటున్న అవమానాలు, రెమ్యూనరేషన్, వర్కింగ్ కండిషన్స్ పలు విషయాలపై అధ్యయనం చేసి కొందరు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలతో మొత్తం 235 పేజీల నివేదికను కేరళ ప్రభుత్వానికి సమర్పించింది. హేమ కమిటీ రిపోర్ట్ బయటికొచ్చాక మాలీవుడ్ కు చెందిన ఎంతోమంది ఇండస్ట్రీలో వాళ్లు ఎదుర్కొన్న సమస్యలను, వేధింపులను బయటపెట్టారు. ఈ అంశాలు మాలీవుడ్ లో సంచలనం సృష్టించాయి.
అయితే హేమ కమిటీ రిపోర్ట్ ఆధారంగా నమోదైన 35 కేసులకు సంబంధించిన బాధితులెవరూ వాంగ్మూలం ఇవ్వడానికి ముందుకు రాకపోవడం వల్ల ఈ కేసులను మూసివేస్తున్నట్టు సిట్ తాజాగా స్పష్టం చేసింది. దీంతో హేమ కమిటీ రిపోర్ట్ ఆధారంగా విచారణ జరిపిన న్యాయస్థానం, ప్రస్తుతానికి ఈ విషయంలో ఎలాంటి చర్చలు తీసుకోవద్దని, అలాగే ఆ కేసులను మూసివేయాలని ఆదేశించింది.
